Friday, November 22, 2024

స్టీల్ ప్లాంట్ పై బిఆర్ఎస్ మ‌హోద్యమం… విశాఖ‌లో భారీ స‌భ

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్‌ శక్తులకు దొడ్డిదారిన కట్టబెట్టాలని చూస్తే భారత రాష్ట్ర సమితి మహాపోరాటానికి శ్రీకారం చుడుతుందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ తోట చంద్రశేఖర్ స్పష్ఠం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన దీక్ష 788 రోజుకు చేరింది. దీక్షలో డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ పాల్గొని స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను తన అనుయాయుడైన అదానీకి దొడ్డిదారిన అప్పజెప్పే కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించకుండా కడపలో కొత్తగా ఏర్పాటు- చేయబోయే స్టీల్‌ ప్లాంట్‌కు సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీ-కరిస్తే ప్లాంట్‌పై ఆధారపడి జీవించే లక్షలాది కుటు-ంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూముల్ని ఆర్‌ఎన్‌ఎల్‌కు బదిలీ చేయించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ నిధులివ్వకుండా గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు తెచ్చారని ఎద్దేవా చేశారు. మోడీ చేష్టలు గమనించిన తెలంగాణ సీఎం కేసిఆర్‌, తాను అమరావతి నిర్మాణానికి ఇవ్వాలనుకున్న రూ.25 కోట్ల చెక్కును తిరిగి తీసుకెళ్లారని గుర్తుచేశారు.

రూ.45 లక్షల కోట్లు-న్న జాతీయ బడ్జెట్‌ నుండి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం ఐదు వేలకోట్ల నిధులు కేటాయించలేదా అని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ ఆస్తులు తెలుగు ప్రజల ఆస్తులని మోడీ గుర్తించాలన్నారు. కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర హొంమంత్రి దృష్టికి తీసుకెళ్లమన్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు తెలంగాణా ప్రభుత్వం తరపున బిడ్‌ వేసేందుకు సిద్దమయ్యారని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు బీఆర్‌ఎస్‌ కేంద్రాన్ని ఢీ కొట్టేందుకు వెనుకాడబోదని హెచ్చరించారు.

త్వరలో విశాఖలో కేసీఆర్‌ భారీ బహిరంంగ సభ
విశాఖనగరంలో త్వరలో బిఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసిఆర్‌తో భారీ బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ శ్రేణులు సమాయత్తమౌతున్నాయన్నారు. బీజేపీ హఠావో దేశ్‌ బచావో అంటూ దేశ ప్రజల్లో చైతన్యం మొదలైందని ఘాటు-గా విమర్శించారు.బి ఆర్‌ ఎస్‌ రాష్ట్ర నేత,మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కలసి వచ్చే ఏ పార్టీతో నైనా కలసి నడిచేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. తొలుత విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు తమ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తోట చంద్రశేఖర్‌కు ఘనస్వాగతం పలికారు. జై కేసీఆర్‌, జై తోట అనే నినాదాలతో దీక్ష శిబిరం వద్ద హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షుడు ఆదినారాయణ, ఐఎన్‌టియుసి నేత మంత్రి రాజశేఖర్‌, బిఆర్‌ఎస్‌ నాయకులు గాదె బాలాజీ, తలారి సురేష్‌, తాడువాక రమేష్‌ నాయుడు, కారణం రామ్మోహన్‌ నాయుడు, బిఆర్‌ఎస్‌ శ్రేణులు, స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement