Friday, November 22, 2024

ఆంధ్రలో బీఆర్‌ఎస్‌ సర్వే ! రంగంలోకి ప్రశాంత్‌ కిషోర్‌ బృందం

అమరావతి, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ నియమితులైన తర్వాత ఆ పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరిగింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఇస్తున్న సూచనలు, సలహాలమేరకే వీరు పనిచేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేయాల్సిన ఐప్యాక్‌ కొంతకాలం క్రితం తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోయింది. అందులో కొన్ని బృందాలు ఏపీలో జగన్‌ కోసం పనిచేస్తున్నాయి. అయితే బీఆర్‌ఎస్‌ ఏర్పాటు ద్వారా ఐప్యాక్‌ సేవలను వాడుకోవాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో సర్వేలు జరుగుతున్నాయి.

ఆంధ్రులు బీఆర్‌ఎస్‌ గురించి ఏమనుకుంటున్నారు?

ఏపీలో బీఆర్‌ఎస్‌ పోటీ చేయడంవల్ల ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటి? అసెంబ్లీ సీట్లు కానీ, లోక్‌ సభ సీట్లు కానీ గెలవడానికి అవకాశాలున్నాయా? ప్రజలు ఏమనుకుంటున్నారు? కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కేసీఆర్‌ చేస్తున్న పోరాటం గురించి ఆంధ్రులు ఏమనుకుంటున్నారు? ఏపీలో వైసీపీ పాలనకు, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనకు మధ్య తేడాను గమనించారా? ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు? బీఆర్‌ఎస్‌ విస్తరణను స్వాగతిస్తారా? తదితర విషయాలపై కేసీఆర్‌ సర్వే నిర్వహింప చేస్తున్నారు.

ఐప్యాక్‌ సర్వే

- Advertisement -

ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐప్యాక్‌) ఈసర్వే నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఏపీలో పోటీ చేయబోయే నియోజకవర్గాలను గుర్తించే బాధ్యతను కూడా అప్పజెప్పారు. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్‌ గురిపెట్టారు. వీటిల్లో విజయావకాశాలుంటాయనేది ఆయన ఆలోచన. అందుకనుగుణంగా కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో కూడా సర్వే జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలకు పోటీ చేయడంకన్నా తనకు అనువుగా ఉన్న సీట్లలో పోటీ చేసి విజయావకాశాలను పెంచుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికలు జరిగే చివరి నిముషంలోనే వీటిని ప్రకటించబోతున్నారు. అప్పటివరకు బయటకు వెల్లడి చేయరని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కనీసం 3 నియోజకవర్గాలన్నా గెలిస్తే..

దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో పోటీ పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సీట్లు గెలుచుకోవడంకన్నా గణనీయ సంఖ్యలో ఓట్లను సాధించగలిగితే రాజకీయంగా ప్రయోజనం సిద్ధిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. జాతీయ పార్టీద్వారా తనకు రావల్సిన 6 శాతం ఓటు బ్యాంకు కోసం కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు కనీసం 3 అసెంబ్లీ నియోజకవర్గాలనైనా గెలుచుకోగలిగితే జాతీయ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీకి బూస్ట్‌ వచ్చినట్లు-వతుందని భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement