అమరావతి, ఆంధ్రప్రభ: పార్టీ పేరు మారింది… జెండా రూపు రేఖలు మారాయి. తెలంగాణ ఇంటి పార్టీగా ప్రసిద్ధికెక్కిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా పేరు మార్చుకుని.. ఇప్పుడు దేశవ్యాపితమైంది. సొంత ఇలాఖాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీకి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కార్యాలయం త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూసుకుంటున్నారు. విజయవాడలో ఆఫీసును అద్దె ప్రాతిపదికన తీసుకుని బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. జనవరిలో ఈ ఆఫీసును సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా వేగవంతం చేయనున్నారు. 9491015222 అనే నంబర్‌కు ఫోన్ చేసి పార్టీలో సభ్యత్వాన్ని నమోదు చేయవచ్చు.
తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ మెంబర్షిప్ తీసుకున్నవారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించినట్లుగానే.. ఏపీలో కూడా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నవారికి ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించనున్నారు. త్వరలో ఏపీకి చెందిన వివిధ జిల్లాల నాయకులు సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లో చేరాల్సిందిగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తనతో సన్నిహితంగా మెలిగిన పలువురు నేతలకు కేసీఆర్ ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలిసింది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో చేరికలు ఉండొచ్చు. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా.. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి… భారత్ రాష్ట్ర సమితిగా మారింది. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు.. బీజేపీని నేరుగా ఢీ కొట్టేందుకు సై అంటున్నారు..! దేశం మారాలి. అది తెలంగాణ నుంచే మొదలవ్వాలని దాదాపు ప్రతి మీటింగ్‌లోనూ చెబుతున్నారు..! ఇప్పటికే పలు పార్టీల జాతీయ నేతలతోనూ ఆయన సమావేశం అయ్యారు. 2023లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇకపై కేసీఆర్ అడుగులు ఉంటాయని చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకలాపాలను అన్ని రాష్ట్రాల్ల్రో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు.