Friday, November 22, 2024

దళారులకు కేరాఫ్‌ మంగళగిరి రవాణా శాఖ కార్యాలయం

  • ప్రతి పనికి ఫిక్స్‌డ్‌ ధర నిర్ణయించి వాహనదారుల జేబులను కొల్లగొడుతున్న వైనం.
  • అడిగినంత ఇచ్చుకోకుంటే కొర్రీలతో ముప్పతిప్పలు.

మంగళగిరి: ఫిబ్రవరి 22 ప్రభ న్యూస్- అవినీతి, అక్రమాలకు మంగళగిరి నగరంలోని రవాణా శాఖ కార్యాలయం నిలయంగా మారింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలుకొని వాహనాల రిజిస్ట్రేషన్‌ వరకు ఇక్కడికి వచ్చే సామాన్యులు దళారుల ద్వారానే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కార్యాలయంలో ఏజెంట్లదే పెత్తనం. అధికారులు, సిబ్బంది దళారులతో కుమ్మక్కై లక్షలు దండుకుంటున్నారు. ప్రతిరోజు దాదాపు పదుల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయంలో రవాణాశాఖ అధికారులు ‘లెక్కలు’ చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా కార్యాలయంలో సిబ్బందిపై నిఘా లేకుండా పోయింది. దీంతో సిబ్బంది పాత్ర షరా మామూలుగానే మారింది.ఏజెంట్ల నుంచి వచ్చిన కాగితాలే ఫైనల్‌ అనే చందంగా రవాణాశాఖ కార్యాలయంలో ప్రస్తుత ధోరణి నెలకొంది. లైసెన్సుల మంజూరు నుంచి వాహనాల తనిఖీ వరకు అంతటా డబ్బులే రాజ్యమేలుతున్నాయి.

లంచాల కోసం పీడింపు.
రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారికి లెర్నింగ్‌ లైసెన్స్‌ నుంచే లంచాల బెడద మొదలవుతుంది. లెర్నింగ్‌ తరువాత రెగ్యులర్‌ లైసెన్స్, వాహనాల రోడ్‌ టాక్స్, ఫిట్‌నెస్‌ వరకు రూ.వేలల్లో లంచాలు దండుకుంటున్నారు. రూ.450 లెర్నింగ్‌ ఫీజకు రూ.600, రూ.2,000 పర్మినెంట్‌ లైసెన్స్‌కు రూ.6 వేలు, రిజిస్టేషన్‌కు ఫీజు కాకుండా ద్విచక్రవాహనాలకు రూ.300, ఫోర్‌ వీలర్స్‌కు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ పరీక్షకు వచ్చే వాహనాలను వివిధ కారణాలు సాకుగా చూపి వేలాది రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ పేరిట జరిగే తతంగం పూర్తిగా లంచాల వసూళ్లకేనన్న చందంగా మారింది. విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్‌నెస్, లారీలు, ట్రక్కుల పన్ను వసూళ్లు, ఓవర్‌ లోడింగ్‌ తదితర విషయాల్లో రవాణా శాఖ సిబ్బంది మామూళ్ల పర్వం అగ్రభాగానికి వెళ్లిపోయింది.

అంతా ఏజెంట్లదే.
రవాణాశాఖ కార్యాలయంలో కొందరు ఏజెంట్లు రాజ్యమేలుతున్నారు. కార్యాలయం తెరవకముందే ఏజెంట్లు తిష్టవేస్తారు. అప్పటికే అక్కడకు వచ్చిన వాహనదారులతో, లైసెన్సుల కోసం వచ్చే వారితో బేరాలు మాట్లాడుకోవడం, తమను కాదని వెళితే లైసెన్స్‌ గానీ, వాహనం రిజిస్ట్రేషన్‌ గానీ కాదని హెచ్చరించి మరీ రోజువారీ సెటిల్‌మెంట్లు చేసుకుంటారు. అధికారులు 10:30 నుంచి 11 : 30 గంటల సమయంలోనే కార్యాలయానికి రావడం సర్వసాధారణమైంది. అప్పటికే ఆ రోజు ఇచ్చే లైసెన్సులు, చేసే రిజిస్ట్రేషన్లు, ఇచ్చే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లకు సంబంధించి సెట్‌ చేసే ఏజెంట్లు అధికారులు రాగానే వారి గదుల్లోకి నేరుగా వెళ్లి మరీ, కమీషన్‌ ముట్టజెప్పి పనికానిచ్చేస్తారు. కార్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిగా ఏజెంట్ల ద్వారానే సాగుతుండగా, డ్రైవింగ్‌ లైసెన్సులకు కూడా ఏజెంట్లే తప్పనిసరిగా మారిందనే విమర్శలున్నాయి.

పంపకాల్లో అటెండర్‌ నుంచి అధికారి వరకు..

- Advertisement -

ఏజెంట్‌ ఇచ్చే మామూళ్లు కార్యాలయంలో పని చేసే అటెండర్‌ నుంచి కార్యాలయంలోని అసలు బాస్‌ వరకు అందరికీ ముడతాయనేది బహిరంగ రహస్యం. కార్యాలయానికి వచ్చిన వారి తో మాట్లాడుకున్న బేరం ప్రకారం ఏజెంట్ల నుంచి వెళ్లిన పత్రాలను పరిశీలించి, ఏజెంట్ల నుంచి వచ్చిన వాటికే ఆమోదముద్ర తెలపడం, మిగతా దరఖాస్తులకు కొర్రీలు విధించడం సా ధారణంగా మారింది. ఫైల్‌పై కోడ్‌భాషలో ఇచ్చే ఇండికేషన్‌ అధికారులు గమనించి, సంతకాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లినా పని కాదని నిర్ణయానికి వచ్చిన వాహనదారులు తిరిగి ఏజెంట్లనే నమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటికైనా రవాణాశాఖ కార్యాలయంలో జరుగుతోన్న అవినీతి వ్యవహారాలపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement