Andhra Pradesh: గంజాయి సాగు నిర్మూలనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రత్యేక పోలీసు బలగాలతో తనఖీలు చేపట్టి ఎక్కడికక్కడ ధ్వంసం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అవసరమైతే డ్రోన్లతో పరిశీలించి గంజాయి లేకుండా చేయాలన్నఆదేశాలందాయి. దీనికి 60రోజుల టార్గెట్ పెట్టుకున్నట్టు పోలీసు అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామాల్లో పత్తి, మిరప తోటల్లో అంతర పంటగా వేసిన గంజాయి మొక్కలను పీకేసి ధ్వంసం చేస్తున్నారు.
కాగా కొన్ని చోట్ల పోలీసులపైకి స్థానికులు తిరగబడుతున్న ఘటనలున్నాయి. కొన్నిచోట్ల అడ్డుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అటువంటి వారిపై కేసులు బుక్ చేస్తున్నారు. తాజాగా విశాఖపట్టణంలోని జీకే వీధిలో పోలీసు వాహనంపై దాడికి యత్నించారు.
అంతేకాకుండా పోలీసులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో గంజాయి అమ్మకాలు చేస్తున్నారని, యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి ఫోన్ కాల్స్‌తో కూడా పోలీసులు అప్రమత్తమవుతున్నారు. తాజాగా విజయవాడలో ఇట్లాంటి ఫోన్‌కాల్‌తో పోలీసులు సంబంధిత అడ్రస్‌కు వెళ్లి చూస్తే.. అక్కడ ఎటువంటి ఆధారాలు లభించలేదు. కానీ, అజ్ఞాత వ్యక్త ఇంటి ముందు ప్యాకెట్లలో గంజాయి ఉందని చెప్పడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్కడికెళ్లి పరిశీలించినప్పటికీ ఎటువంటి గంజాయి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి ఆ నెంబర్‌కు కాల్ చేస్తే.. స్విచ్ఛాఫ్ వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినా.. ఫేక్ కాల్స్ చేయకూడదని.. స్పష్టమైన ఆధారాలుంటే మాత్రమే తెలియజేయాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.