Tuesday, November 26, 2024

Breaking: చెన్నైకి రెడ్ అల‌ర్ట్.. 48 గంట‌ల్లో మ‌హా వాయు‘గండం’..

బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ మ‌రో అల్ప‌పీడ‌నం రాగ‌ల‌ 48 గంటల్లోగా ‘మహా వాయుగుండం’గా తీవ్రరూపం దాల్చనుంది. దీంతో ఈనెల 12వ తేదీ వరకు తమిళనాడు లో భారీవర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. ఈశాన్యం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

రుతుపవనాల వాప‌స్‌తో గత నెల 28 నుంచి ఈనెల 3వ తేదీ దాకా డెల్టా, కోస్తా జిల్లాలను వర్షం ముంచెత్తింది. ఆ సమయంలో 42 శాతం అదనంగా వర్షపాతం నమోదైందని, మరో రెండు వారాల్లో భారీ, అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధనకేంద్రం ముందుగానే హెచ్చరించింది.

గరిష్టంగా ఈరోడ్‌ జిల్లా గోపిశెట్టిపాళయంలో 11 సెం.మీ, విరుదునగర్‌, సేలం, నామక్కల్‌, శ్రీవిల్లిపుత్తూర్‌, రాశిపురం, మదురై, శివకాశి, కడలూరు జిల్లాల్లో 8 సెం.మీ, చొప్పున‌.. కొడైకెనాల్‌, కోవిల్‌పట్టి, ఖయత్తారు ప్రాంతాల్లో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

చెన్నైలో కుండపోత..
శనివారం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చెన్నైలోని పలుప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమం అయ్యా యి. కొన్నిచోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచే త‌మిళ‌నాడులో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీలంక సమీపంలోని కన్నియాకుమారికి చేరువగా కేంద్రీకృతమై అల్ప పీడ‌నం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ వాయుగుండం కారణంగా ఈశాన్య రుతుపవనాలు మరింత బలపడతాయ‌ని ఐఎండీ పేర్కొంది.

దీని ప్రభావంతో కన్యాకుమారి, తూత్తుకుడి, విరుదునగర్‌, రామనాథపురం మదురై, పుదుకోట, శివగంగ తదితర డెల్టా జిల్లాలు, కడలూరు, విల్లుపురం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, తిరువళ్లూర్‌, కృష్ణగిరి, ధర్మపురి తదితర జిల్లాల్లో భారీ, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఆనకట్టలు, వాగులు, చెరువులు వేగంగా నిండుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇళ్లు నేలకొరిగాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చే 9 నుంచి 12వ తేదీలోపు వాయుగుండం కోస్తా జిల్లాల మీదుగా పయనించే అవకాశముందని, ఆ సమయంలో బంగాళాఖాతంలో 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లో 11,12 తేదీల్లో గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

నీలగిరి, కొడైకెనాల్‌లలో…
ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన నీలగిరి, కొడైకెనాల్‌లలో కురుస్తున్న భారీవర్షాలకు ఘాట్‌ రోడ్డులో మట్టిపెళ్లలు, బండరాళ్లు జారిపడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీలగిరి జిల్లాలోని కున్నూరు, కుందా రోడ్డు, కరుంపాలం, పీక్కాడు ఎస్టేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షపు నీటిలో క్యారెట్‌, క్యాబేజీ తదితర పంటలు మునిగిపోయాయి. అదేవిధంగా దిండుగల్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొడైకెనాల్‌ ప్రాంతంలో రహదారుల్లో వర్షపు నీరు వరదలా ప్రవహించింది. ఘాట్‌ రోడ్డులో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, మట్టిపెళ్లలు జారిపడడంతో ఆ మార్గంలో వాహనాల్లో వెళ్లిన సందర్శకులు కదల్లేని పరిస్థితి నెలకొంది.

సీఎం స్టాలిన్‌ సమీక్ష
వాతావరణ శాఖ జారీచేసిన హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సచివాలయంలో శనివారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌లతో సమావేశమయ్యారు. మంత్రులు, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ, ప్రజాపనుల శాఖల ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్షాలకు పంటలు నష్టపోయే రైతుల వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి నివేదికగా సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అదే విధంగా, కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్‌, టెలిఫోన్‌ స్తంభాలను గుర్తించి తక్షణం తొలగించాలని, ప్రాణనష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో కలసి అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement