విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను కాదంటుందనే కారణంగా చంపేస్తానని బెదిరించాడు. ఓ హోటల్ రూమ్‌కి పిలిచి తను తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇప్పుడు వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిద్దరికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తన ప్రేమను కాదంటోందన్న కారణంతో యువతిని చంపేయాలని ప్రేమోన్మాది హర్షవర్దన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మాట్లాడాలని ఆమెను లాడ్జికి రమ్మని ఒత్తిడి తీసుకొచ్చాడు. రాకుంటే కుటుంబ సభ్యులను అంతమొందిస్తానని బెదిరించడంతో బాధిత యువతి అక్కడికి వెళ్లింది. ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను హర్షవర్దన్ యువతిపై పోసి నిప్పంటించాడు. పెట్రోల్ దాడిలో వారిద్దరి శరీరాలు తీవ్రంగా కాలిపోయాయని, వారి పరిస్థితి ఇప్పుడు క్రిటికల్ ఉందని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ అంటున్నారు.