అమరావతి పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు ఏపీ హైకోర్టు సీజే. అది రైతుల రాజధాని మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరిదీ అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రెండోరోజు వాదనల్లో అమరావతిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. 30 వేలమంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని అని వ్యాఖ్యానించారు.
రాజధాని అమరావతి.. విశాఖ, కర్నూలు సహా అందరిదీ అని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు తమ కోసమే పోరాడలేదన్న ప్రధాన న్యాయమూర్తి.. దేశ ప్రజలందరి కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ రోజు ఉదయం.. రైతుల తరపున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అమరావతికి సంబంధించిన కీలకాంశాలు కోర్టు దృష్టికి తెచ్చారు.
రాజధాని కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో అమరావతి దెయ్యాల రాజధానిగా మారిందన్నారు. అమరావతిని త్వరగా అభివృద్ధి చేసి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.