నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. ఆయన వాకింగ్ చేయకుండా పార్క్ గేటుకు అధికారులు తాళాలు వేశారు. అధికారుల తీరుపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన పార్కులోకి తనను రానివ్వరా అంటూ ఫైర్ అయ్యారు.
వివరాల మేరకు.. డోన్ పట్టణంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజేష్ తో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఆయన వాకింగ్ చేయకుండా గేటుకు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు. తాళాలు వేయడంతో అక్కడే కూర్చుని కాఫీ తాగి వెళ్లారు. బుగ్గన తాను ప్రారంభించిన పార్కుకు తాళాలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భార్య సుజాతమ్మపై పద్ధతిగల పరిణితి గల రాజకీయం నేర్చుకో అంటూ బుగ్గన ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… గతంలో ఈ పార్కు స్థానంలో గతంలో కుక్కలు, పందులు తిరిగేవని ముళ్ళకంపల చెట్లు పొదలు ఉన్నాయని, అసాంఘీక కార్యక్రమాలు నిర్వహించేవారు, తాను కట్టించిన పార్కు స్థలంలో తనను పర్యటించనీయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించిన ఆస్తిలో ప్రజలను తిరగనియ్యరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు.. మంచి చేయండన్నారు. అనుభవంతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని సూచించారు.
అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తనను కాదు మీరు లాక్ చేస్తున్నది ప్రజలను లాక్ చేస్తున్నారని మండిపడ్డారు. డోన్ ప్రజల అభిమానాన్ని సంపాదించండి.. అంతే కానీ ఇలా గేట్లకు తాళాలు వేసుకుంటూపోతే ప్రజలు క్షమించరన్నారు. తాను వస్తున్నానని చెప్పి తాళం వేశారు. రాజకీయ కక్ష్యతోనే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో భవిష్యత్తులో ఏం జరిగిందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.