Wednesday, November 20, 2024

Brazil To Vishakha – డ్రగ్స్ కంటైనర్ … కొన‌సాగుతున్న ద‌ర్యాప్తు …..

విశాఖపట్నం పోర్ట్‌కు బ్రెజిల్ నుంచి చేరిన డ్రగ్ కంటైనర్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇలాంటి కంటైనర్‌కు సంబంధించిన వార్తలు వినడమే తప్ప చూసింది లేదు. అలాంటిది నేరుగా కంటైనర్ విశాఖ పోర్ట్‌కు చేరడంతో ఒకరకంగా చెప్పాలంటే స్థానికులందరూ చిన్నపాటి షాక్‌కు గురయ్యారు. మార్చి 16న విశాఖ చేరుకున్న కంటైనర్‌ను.. మార్చి 19న అధికారులు ఓపెన్ చేసి కొన్ని ర్యాండమ్ టెస్ట్స్ నిర్వహించగా.. నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్టుగా నిర్దారించారు. అనంతరం మరింత లోతైన పరీక్షల కోసం నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నిపుణులను తీసుకొచ్చారు

సీబీఐ జడ్జి సమక్షంలో వెయ్యి బ్యాగ్‌లలోని శాంపిల్స్‌ను సేకరించి, డ్రగ్ డిటెక్షన్ టెస్టులను నిర్వహించింది సీబీఐ. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన శాంపిల్స్ సేకరణ, పరీక్షల నిర్వహణ.. అనంతరం కొన్ని నమూనాలను నార్కోటిక్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకు పంపారు అధికారులు. ఫలితాల కోసం వారం సమయం పట్టే అవకాశం ఉంది. సీబీఐ ప్రాథమిక పరీక్షల్లో ప్రమాదకర 6 రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్టుగా నిర్దారణ అయింది. డ్రై-ఈస్ట్‌తో మిక్స్ చేసి సరఫరా చేసినట్టు సీబీఐ అనుమానిస్తోంది. ఈ పదార్థాన్ని సరఫరా చేసిన ఐసీసీ- బ్రెజిల్ కంపెనీతోనూ సంప్రదింపులు చేస్తోంది సీబీఐ. సంధ్యా ఆక్వా – ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య జరిగిన మెయిల్ సంభాషణలను పరిశీలిస్తున్నారు అధికారులు. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించి, నిర్దారణ తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నట్టు సమాచారం.

కంటైనర్‌ను తెచ్చిన నౌక ఏమైంది.? బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి డ్రై-ఈస్ట్‌తో ఉన్న కంటైనర్ జనవరి 14న చైనాకు సంబంధించిన వ్యాపార నౌక బయల్దేరింది. వాస్తవానికి ఫిబ్రవరిలోనే విశాఖపట్నం చేరాల్సి ఉన్నా.. రెడ్‌సీలో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 16న విశాఖకు చేరుకుంది. మధ్యలో ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఎంటరై ఆ ఓడను ట్రాక్ చేస్తూ వచ్చింది. సీబీఐ పూర్తిస్థాయిలో నౌక గురించి ఆరా తీసేసరికి ఆ నౌక విశాఖలో కంటైనర్‌ను దింపి తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు వెళ్లింది. అక్కడ కస్టమ్స్ అధికారుల సమన్వయంతో నౌక అధికారులను ప్రశ్నించగా బ్రెజిల్ నుంచి ఈస్ట్ ఉన్న కంటెయినర్‌ను విశాఖ పోర్టులో జేఎం భక్షికి చెందిన టెర్మినల్ బెర్త్‌లో దించినట్లు వెల్లడించారు. దీంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు నేరుగా మార్చి 18వ తేదీ విశాఖకు చేరుకుని తదుపరి విచారణ ప్రారంభించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement