తిరుచానూరు , ఆంధ్రప్రభబ్యూరో (రాయలసీమ) : తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈ రోజు లక్షలాది మంది భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పంచమీ తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరాలయం నుంచి సంప్రదాయ సిద్ధంగా పసుపు కుంకుమల అప్పాపడి ఉరేగింపు మొదలైంది. స్వామి వారి తరపున అమ్మవారికి సమర్పించడానికి సిద్ధం చేసిన రూ ఒక కోటి 11 లక్షల విలువైన పాండ్యరాజ కిరీటం, వజ్రాల హారం, లక్ష్మీపతకం , వజ్రాల గాజులు, వజ్రాల కమ్ముల ఆభరణాలను అప్పాపడి తో కలిపి తిరుమల తిరుపతి దేవస్థానాల (టి టి డి)ఉన్నతాధికారులు ఒకరి నుంచి మరొకరికి అందచేసుకుంటూ ముందుకు తీసుకువచ్చారు.
అర్చకులు ఊరేగింపుగా తిరుపతిలోని అలిపిరి, కోమలమ్మ సత్రం, రాములవారిగుడి, గోవిందరాజుల గుడి మీదుగా తిరుచానూరు కు తీసుకువచ్చారు. అలిపిరి నుంచి ఏనుగుపై ఊరేగుతూ వచ్చిన అప్పాపడి తిరుచానూరు శివారులోని పసుపు మండపం వద్ద అర్చకులు స్వాగతం పలికి పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకు వెళ్లారు. ఆలయంలోని అమ్మవారి సముఖంలో అప్పాపడి కి పూజలు చేసిన అర్చకులు ఊరేగింపుగా ఆలయ పుష్కరిణి ఒడ్డున ఉన్న పంచమీ తీర్థ మండపం వద్దకు చేర్చారు. అంతకుముందే అక్కడకు చేర్చిన పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి, సుదర్శన చక్రానికి పాంచరాత్ర ఆగమోక్తంగా పంచ కలశ తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సుముహూర్తంలో అమ్మవారి తరపున సుదర్శన చక్రాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ పుష్కరణి జిల్లాల్లో మూడుసార్లు పవిత్ర స్నానం చేయించారు.
ఆ క్షణం కోసం వేచిఉన్న భక్తకోటి చక్రం తో పాటు పుష్కరిణీ జలాల్లో పుణ్యస్నానాలను ఆచరించారు.ఈ పంచమీ తీర్థ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మూడు లక్షల మందికి పైగా భక్తులు రోజంతా పుష్కరిణి జలాల్లో స్నానాలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అనంతరం టి టి డి భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వినియోగం ఏర్పాట్లు చేసింది. టి టి డి పోలీసు శాఖల సమన్వయంతో లక్షలాదిమంది భక్తులు ఈ ఏడాది పంచమీ తీర్థ మహోత్సవంలో సంతృప్తి కరంగా పాల్గొన్నారు.భారీ బందోబస్తు ఏర్పాట్ల మధ్య పంచమీ తీర్థం వైభవంగా ముగిసింది.
ఈ కార్యక్రమాలలో టి టి డి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బి ఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామల రావు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి, సంయుక్త కార్యనిర్వహణాధికారి వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బారాయుడు, ఇతర టి టి డి ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు పంచమీతీర్థ మహోత్సవం తో పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసాయి.