Saturday, November 23, 2024

కపిలేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు షురూ..

తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, వినాయక స్వామి, చండికేశ్వరస్వామి, శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు మణిస్వామి కంకణభట్టర్‌గా వ్యవహరించారు.

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ త‌ర్వాత‌ ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధన చేశారు. కుంభహారతి ఇచ్చారు. ఆ త‌ర్వాత‌ ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. ఉత్సవాలను కొవిడ్‌ నిబంధన మేరకు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. అనంతరం కపిలేశ్వరస్వామివారికి, కామాక్షి అమ్మవారికి ఆల‌యంలో పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement