వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్‌లో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకూ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వెల్లడించారు.
ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ జేఈవో కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్, జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా.. సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. ఎక్కడా మోడల్ కోడ్ ఉల్లంఘన జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అదేశలు జారీ చేశారు. ఈ విషయంలో టీటీడీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఏప్రిల్ 22న రాములోరి కల్యాణం..
ఏప్రిల్ 22వ తేదీన జరిగే సీతారాములవారి కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు సీఎం, గవర్నర్ తదితర ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. భక్తులు పెద్ద ఎత్తున రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణవేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇన్‌చార్జిగా నియమిస్తామన్నారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద ఎక్కడా జనం తొక్కిసలాట జరుగకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు..
= ఏప్రిల్ 16న సాయంత్రం – అంకురార్పణ
= 17వ తేదీన ఉదయం – ధ్వజారోహణం (మీథున లగ్నం) సాయంత్రం – శేష వాహన సేవ
= 18న ఉదయం – వేణుగానాలంకారము, సాయంత్రం – హంస వాహన సేవ
= 19న ఉదయం – వటపత్రశాయి అలంకారము, సాయంత్రం – సింహ వాహన సేవ
= 20న ఉదయం – నవనీత కృష్ణాలంకారము, సాయంత్రం – హనుమత్సేవ
= 21న ఉదయం – మోహినీ అలంకారము, సాయంత్రం – గరుడసేవ
= 22న ఉదయం – శివధనుర్భంగాలంకారము, సాయంత్రం – కళ్యాణోత్సవము(సా.6.30- రా.8.30)/ గజవాహనము
= 23న ఉదయం – రథోత్సవం
= 24న ఉదయం – కాళీయమర్ధనాలంకారము, సాయంత్రం – అశ్వవాహన సేవ
= 25న ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం
= 26న సాయంత్రం – పుష్పయాగం.