అమరావతి – ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి.. అయితే, అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన నేడు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిష్కరించారు.. కాగా, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వినాశక చట్టాలు చేసిందని ఆ ప్రతులను అసెంబ్లీ బయట తగలుబెట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మూడు రాజధానులు చట్టం, మద్యం అమ్మకాల తాకట్టు, మీడియాపై ఆంక్షలు వంటి జీవోలు దహనం చేశారు.. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రతులు, ఇతర ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రతులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్ధం చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ రోజు అంటూ నినాదాలు చేశారు. నేటితో రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం వదిలిపోయిందని నినదించారు టీడీపీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు.
ఐదేళ్ల శాసన సభ …చీకటి సభే..
ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఐదేళ్ల శాసనసభ చీకటి సభే.. చివరి రోజు కూడా యాత్ర సినిమా కోసం సభను 2 గంటలు వాయిదా వేశారని విమర్శించారు.. మరోవైపు.. ఆశా వర్కర్లపై లాఠీచార్జ్ చేయడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు .. సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా? ఐదేళ్లుగా ఆశాలతో జగన్ రెడ్డి వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. ఆదాయ పరిమితి నిబంధనతో ఆశాలను సంక్షేమానికి దూరం చేశారని, సెలవులివ్వకుండా, పని భారంతో ఒత్తిడి పెంచడం అమానుషం కాదా? అంటూ నిలదీశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే నిరసన తెలిపడం నేరమెలా అవుతుంది? అని ప్రశ్నించారు. తక్షణమే ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని. సకాలంలో వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.
ఇక, టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఐదేళ్ల శాసనసభలో ప్రతీ రోజూ బ్లాక్ డేనే అని విమర్శించారు. ప్రజల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం శాసనసభ లో మంటగలిసిందంటూ ఫైర్ అయ్యారు.