విజయనగరం జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పసికందును రైలు పట్టాల పక్కన విడిచి వెళ్లడం స్థానికంగా కలకలంరేపింది. కొత్తవలస – విశాఖ రోడ్డులో కరెంట్ ఆఫీస్ దగ్గర రైల్వేట్రాక్ సమీపంలో ఆ పసికందును బ్యాగ్‌లో ఉంచి పడవేశారు. ఆ పక్కనే పండ్ల వ్యపారం చేస్తున్న మల్లి అనే వ్యక్తి చిన్నారి ఏడుపు విని వెళ్లాడు. అక్కడ బ్యాగ్‌లో ఉన్న శిశువును గుర్తించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో వారు ఐసీడీఎస్ పీవో, సూపర్‌వైజర్‌కు వివరాలు తెలిపారు. వారు ఆస్పత్రికి వచ్చి బిడ్డను తీసుకుని విజయనగరంలోని ఘోషా ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి వైద్యం అందించి ఆ తర్వాత శిశుగృహకు అప్పగించారు. రైల్వే ట్రాక్ పక్కన ఇలా దారుణంగా పసిబిడ్డను వదిలి వెళ్లడం దారుణమని స్థానికులు చర్చించుకున్నారు. ఆ పసికందును ఎవరు అక్కడ పడేసి వెళ్లారని పోలీసులు స్థానికులను అడిగి వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా, అప్పుడే పట్టిన పసికందును రైల్వే ట్రాక్‌పై వదిలివేయడం అమానుషమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ గోటేటి హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యసమాజం తల దించుకునే చర్య అని పేర్కొన్నారు.