సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం మచీలీపట్నం అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మచిలీపట్నం కాంప్‌బెల్ ప్రాంతానికి చెందిన చిన్న మస్తాన్, చిన్న నాంచారయ్య, నర్సింహారావు, మోకా వెంకటేశ్వరరావు కలిసి శనివారం గిలకలదిండి నుంచి మర బోటులో చేపల వేటకు వెళ్లారు.
అయితే బోటుపై చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు కనిపించకుండా పోయారు. వారి బోటు రిపేరుకు వచ్చిందని, ఆదివారం రాత్రి అంతర్వేది దగ్గర నుంచి బోటు యజమాని ఏడుకొండలకు ఫోన్ చేశారు. తమ కోసం మరో బోటు సాయం పంపాలని కోరారు. ఆ తర్వాత అక్కడికి సాయం కోసం వెళ్లిన బోటు వారికి ఈ నలుగురు కనిపించలేదు. దీంతో అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో మూడు బోట్లు, నేవీ చాపర్ కూడా రంగంలోకి దిగాయి. పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, కోస్ట్ గార్డ్, మెరైన్, నేవీ సహాయంతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. మచిలీపట్నం ఆర్డీవో ఆఫీసులో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. కాగా, వేట ముగించుకుని మంగళవారం చేరుకోవాల్సిన వారు రాకపోవడం, వారి సెల్ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ కావడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.