ఏపీలో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం జిల్లాలో మద్యం మత్తు నలుగురు యువకుల జీవితాలను చిదిమేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా 8 మంది యువకులు ఆదివారం రాత్రి యానాంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వేడుకల తర్వాత.. స్వగ్రామానికి ఆటోలో బయల్దేరారు. గత అర్థరాత్రి 12.30 గంటల తర్వాత అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో శ్రీ వనువులమ్మ టెంపుల్ ఎదురుగా.. ఎన్హెచ్216 రోడ్డుపై అమలాపురం నుంచి ముమ్మిడివరం వైపుగా వెళ్తున్న చేపల లారీ ని ఢీ కొట్టింది.
ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందిలో నలుగురు మృతి చెందారు. ప్రమాద ప్రాంతానికి వెళ్లిన పోలీసులు గాయపడిన నలుగురు క్షతగాత్రులను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. సోమవరప్పాడు వద్ద రెండు బైకులు ఢీ కొనగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.