Thursday, September 12, 2024

AP: రక్తసిక్తమైన వి.కోట.. ఒక వర్గంపై మరో వర్గం దాడులు

కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత
హుటాహుటిన చేరుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
రాళ్ల దాడిలో పలమనేరు డీఎస్పీకి గాయాలు
ఒక వర్గానికి చెందిన ఆస్తులు భారీగా ధ్వంసం
30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్ అమలు
కొనసాగుతున్న భాధితుల అందోళన
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండల కేంద్రం రక్తసిక్తమైంది. ఒకవర్గం మరో వర్గం మీద దాడులు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హుటాహుటిన జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు రోజులపాటు వి.కోట మండలంలో పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. గొడవలను అదుపు చేయడానికి ప్రయత్నించిన పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ మీద కూడా రాళ్ల దాడి జరిగింది. ఆయన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల్లో ఒక వర్గానికి చెందిన పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వి.కోట పట్టణానికి పలువురు బీజేపీ నాయకులు చేరుకుంటున్నారు. పరిస్థితి నివురుకప్పిన నిప్పులా ఉంది.

చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో చిన్న గొడవ భారీ విధ్వంసానికి దారితీసింది. సోమవారం రాత్రి క్రికెట్ బాల్ ఒక మహిళకు తగలడంతో గొడవ ప్రారంభమైంది. తనకు క్రికెట్ బాల్ తగలడంతో ఆ మహిళ తరఫున వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. మరో వర్గం వారు భాధిత కుటుంబంపై దాడులు చేశారు. దీంతో వి.కోట పట్టణం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం వారు మరో వర్గం వారి మీద దాడులు చేశారు. ఒక వర్గం వారు కత్తులు, రాడ్లు, కర్రలతో వీరవిహారం చేశారు. దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఒక వర్గం అంబేద్కర్ సర్కిల్ లో ధర్నాకు దిగింది. వారి మీద మరో వర్గం దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. విషయం తెలియగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పలమనేరు డీఎస్పీ ఇరువర్గాలకు సర్దిచెప్పి, శాంత పరిచే ప్రయత్నం చేశారు.

ఒక వర్గం డీఎస్పీ ప్రభాకర్ మీద రాళ్లు రువ్వ‌డంతో ఆయన తలకు బలమైన గాయమైంది. ఆయనను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలియగానే హుటాహుటిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అక్కడికి చేరుకున్నారు. వి. కోట పట్టణంలో పోలీస్ 30 యాక్టు, 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ క్షతగాత్రులను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరామర్శించారు. ధర్నా విరమించాల్సిందిగా ఒక వర్గానికి విజ్ఞప్తి చేశారు. తమపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసే వరకు ధర్నా విరమించబోమని మరో వర్గం తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా సోమవారం అర్ధరాత్రి దుండగులు జనసేనకు చెందిన ట్రాన్స్ పోర్ట్ అధినేత పొట్టు భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. అతనికి సంబంధించిన 8బస్సుల అద్దాలను పగలగొట్టారు.

అతని ఇంటిముందు ఆపిన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో సుమారు 5లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించిందని భావిస్తున్నారు. గొడవలో ఒక దినపత్రిక విలేకరి కూడా గాయపడ్డారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఒక ప్రకటన చేస్తూ వి.కోట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు 30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని, దుకాణాల వద్ద నలుగురు కన్నా ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదన్నారు. ర్యాలీలు, ధర్నాలకు ఎటువంటి అనుమతులు లేవని, ప్రజలు సంయ‌మ‌నం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన సంఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఆస్తి నష్టం జరిగిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సంఘటనలో తప్పు చేసిన వారికి శిక్షపడే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వి.కోట పట్టణంలో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఇరవర్గాలతో శాంతి కమిటీ సభ్యులు మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చట్టాన్ని అతిక్రమించి దాడులు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరించారు. ఒక వర్గం మీద దాడులు జరగడంతో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, ఇతర బీజేపీ జిల్లా నాయకులు అక్కడికి చేరుకున్నారు. బాధితులకు అండగా నిలబడ్డారు. వి.కోట పట్టణంలో పరిస్థితి నివురుకప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒక వర్గం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement