చిన్నచిన్న విషయాలకు గొడవలు పడి జీవితంలో ప్రశాంతతను కోల్పోవద్దని, ఆస్తులు కన్నా రక్త సంబంధాలు చాలా గొప్పవని, వాటి విషయంలో ఎవరూ తప్పిదాలు చేయవద్దని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ఆస్తి తగాదాలు, ఇతర గొడవలతో జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని, అందరూ ప్రశాంతంగా చీకూచింతా లేని జీవితాలు గడపాలని హితవు పలికారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం న్యాయసేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామవరంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ లక్ష్యాలను చేరుకోవటంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని సూచించారు.
న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయసేవాధికార సంస్థ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు వారి హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ… న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవల గురించి వివరించారు. పేదలకు, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయసేవాధికార సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం విజయనగరం బార్ అసోసియేషన్ ప్రెసిడెండ్ పి.హరగోపాల్, కార్యదర్శి ఏవీఎన్ అంజనీకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామవరం సర్పంచ్ పద్మావతి, ఎంపీపీ హైమావతి, గంట్యాడ తహశీల్దార్ ప్రసన్న రాఘవ, సీఐ మంగవేణి, గంట్యాడ ఎస్ఐ కిరణ్‌కుమార్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ జైహింద్‌కుమార్, ఉప సర్పంచ్ నాయుడు, ప్యానల్ లాయర్లు లలిత, మధుసూధన్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.