Tuesday, November 26, 2024

సేవలోనే పరమానందం : వెంక‌య్య నాయుడు

సేవలోనే పరమానందం దాగిఉందని, మానవసేవే మాధవసేవ అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారని సేవ చేయడానికి మించిన భగవదారాధన లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. వెంకటాచలం స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. కష్టపడి సంపాదిస్తూ ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా, సంపాదన ద్వారా వచ్చే తృప్తికంటే సేవా కార్యక్రమాల ద్వారా కలిగే సంతృప్తి వెలకట్టలేనిదని, సేవా మార్గానికి మించిన భగవంతుని సేవ లేదని ఆయన పేర్కొన్నారు. పదిమందికి మేలు చేస్తున్నప్పుడు గుండె లోతుల్లోంచి కలిగే భావనను వర్ణించలేమన్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆస్తులు మాత్రమే వారసత్వంగా ఇవ్వకుండా మంచితనాన్ని, మానవత్వాన్ని, సమాజం పట్ల మన బాధ్యతను చాటుకోవడాన్ని వారసత్వంగా ఇస్తే మనం చేసే మంచి కార్యక్రమాలను తర్వాతి తరం కూడా ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుందన్నారు. పెద్దలు అందించిన సేవాభావాన్ని ముందుకు కొనసాగించడమే అసలైన వారసత్వమని ఉపరాష్ట్రపతి అన్నారు. తన సేవా సంకల్పాన్ని భుజానికి ఎత్తుకునేందుకు తన కుమారుడు, కుమార్తె ముందుకు రావడాన్ని, దానికి తమ మిత్రులు అండగా నిలవడాన్ని ఆయన అభినందించా రు. గ్రామస్వరాజ్యం లేని రామరాజ్యం సాధించలేమన్న గాంధీ మహాత్ముని స్ఫూర్తితో, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ, నానాజీ దేశ్‌ముఖ్‌ గ్రామీణ పునర్ వైభవ నినాదంతో స్వర్ణభారత్‌ ట్రస్టును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. తానెక్కడ ఉన్నా, ఏ హోదాలో ఉన్నా స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా లభించే సంతృప్తి మరింత ప్రత్యేకమైందన్నారు.


దేశ సమగ్రత పరిరక్షణలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
జమ్ము-కాశ్మీర్‌ అభివృద్ధికి అడ్డంకిగా నిలిచిన 370 ఆర్టికల్‌ రద్దుకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సహకారం మరువలేనిదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్‌ లో జరిగిన వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ, నానాజీ దేశ్‌ముఖ్‌ కలలుగన్న గ్రామీణాభివృద్ధి, అంత్యోదయ నినాద స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపడుతున్న స్వర్ణభారత్‌ ట్రస్టును అభినంధించారు. స్వర్ణ భారతి ట్రస్ట్‌ వెంకయ్యనాయుడు ఆలోచనలకు ప్రతిబింబం అని ప్రశంసించారు. సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తి గా, ఉద్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా చేపట్టడం అంత సులభమైన పనేమీ కాదన్నారు. విలువల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్టు ఎంతోమంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందకుండా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ట్రస్టు ద్వారా ముందుకు తీసుకెళ్తుండటం, మహిళా సాధికారత పై ప్రత్యేకంగా కృషిచేస్తుండటాన్ని అమిత్‌ షా ప్రత్యేకంగా అభినందించారు. కేంద్రప్రభుత్వం సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ నినాదంతో ముందుకెళ్తోందన్నారు. ఉపరాష్ట్రపతి స్వయంగా గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కావడం, వారి బాల్యమంతా పల్లెటూళ్లలోనే గడవడం వల్ల ఇక్కడి సమస్యలు, వాటి పరిష్కారం గురించి వారికి చాలా బాగా తెలుసని తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌, ముప్పవరపు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ముప్పవరపు హర్షవర్దన్‌, స్వర్ణ భారత్‌ ట్రస్టు బాధ్యులందరినీ అమిత్‌ షా పేరుపేరునా అభినందించారు.


హృదయ-క్యూర్‌ ఏ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌కు రూ.50 లక్షల విరాళం :
ఉపరాష్ట్రపతి మనవరాలు నీహారిక హృదయ-క్యూర్‌ ఏ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌కు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తన తాత అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు స్ఫూర్తితో ఆమె రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తన వివాహం నిశ్చయమైన నేపథ్యంలో పెళ్లి ఖర్చులు తగ్గించుకుని, పేద పిల్లలకు ఉచితంగా గుండె చికిత్సను అందిస్తున్న హృదయ – క్యూర్‌ ఏ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌కు ఈ విరాళాన్ని ప్రకటించారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ 20 వసంతాల వేడుకల సందర్భంగా తాను ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎం రమేష్‌, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, గుంటూరు డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, జిల్లా ఎస్పీ విజయారావు, జాయింట్‌ కలెక్టర్లు హరేందిర ప్ర సాద్‌, గణేష్‌కుమార్‌, విదేహ్‌ ఖరే, ట్రైనీ కలెక్టర్‌ ఫర్హాన్‌ అహ్మద్‌ ఖాన్‌, బీజేపీ రాష్ట్ర నాయకులు సోమువీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement