విజయవాడ: వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా ఏ పిట్టల దొరకు టిక్కెట్టు ఇచ్చినా తనకు ఇబ్బంది లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందా? తాను ఎంపీ అవుతానా? అనే భయం తనకు లేదన్నారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని కేశినేని నాని తేల్చి చెప్పారు. తన మాటలను పార్టీ ఎలా తీసుకన్నా తనకు భయం లేదన్నారు. తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని కేశినేని నాని చెప్పారు. తాను చేసిననన్ని పనులు దేశంలో ఏ ఎంపీ కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు.
ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమోనని నాని వ్యాఖ్యానించారు. వైసీపీలోకి కేశినేని నాని వస్తానంటే స్వాగతిస్తామని వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి మీడియాతో వ్యాఖ్యలు చేసిన రోజే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2019 ఎన్నికల తర్వాత అవకావశం దొరికినప్పుడల్లా టీడీపీ పై నాని విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీలో తనకు కట్టబెట్టిన పదవులు కూడా వద్దని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నానికి ఇతర నేతలకు మధ్య ఉన్న విబేధాలు మరింత బహిర్గతమయ్యాయి. కేశినేని నాని చంద్రబాబు ర్యాలీలో పాల్గొంటే తాము దూరంగా ఉంటామని బుద్దా వెంకన్న ప్రకటించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇతర టీడీపీ నేతలతో కూడ నానికి మధ్య గ్యాప్ పెరిగింది..ఈ నేపథ్యంలో నానీ సోదరుడు చిన్నా యాక్టీవ్ అయ్యారు.. టిడిపి కార్యక్రమాలలో చురుగ్గాపాల్గొంటూ అధిష్టానానికి దగ్గరయ్యారు.. విజయవాడ లోక్ సభ సీటును చిన్నా ఆశిస్తున్నారు..