ఏపీలో ఎన్నికల వాతావరణం రంజుగా మారింది. అటు రాజకీయ పార్టీలు ఎన్నికల ఊరింతలు, తాయిలాలతో జనంపైకి ఎగబడుతుంటే.. ఇటు పోలీసు అధికారులు లెక్కలేనంత బ్లాక్ మనీపై దృష్టి సారించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే పోలీసుల కట్టడి పెరిగిపోతుందనే భయంతో బ్లాక్ మార్కెటర్లు హడావిడిని పెంచారు. హవాలా అవకాశం లేని ప్రాంతాలకు బంగారం, నగదు తరలిస్తున్నారు. మరో వైపు ఫలానా పార్టీ డబ్బు తరలిస్తోందని ఇంటిలిజెన్స్ అధికారుల చెవులు కొరికేసే ఫోన్ కాల్స్ పెరిగిపోయిన తరుణంలో.. ఏపీలో కేవలం ఒక్క రోజులోనే రూ.16 కోట్ల బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు, బెజవాడ, భీమవరం, కర్నూలు జిల్లాల్లో ఒక్కరోజే పెద్ద ఎత్తున అక్రమ నగదు, బంగారం పట్టుకున్న ఘటనలు జరిగాయి.
నెల్లూరు జిల్లా గూడూరులో రూ.5.12 కోట్ల అక్రమ నగదు వెలుగు చూసింది. నెల్లూరు నుంచి కొందరు చెన్నైకిఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 5.12 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం చిల్లకూరు, గూడూరు పట్టణ, రూరల్ ప్రాంతాల్లో 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బెజవాడలో 3 కిలోల బంగారం
చెన్నై నుంచి విజయవాడకు అనధికార నగలను తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసిసుమారు 3. 681 కిలోల బంగారాన్ని సత్యనారాయణ పురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ పురం సీఐ ఎం వెంకటరమణవివరాల ప్రకారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేస్తుండగా విజయవాడ నగరానికి చెందిన నాగ పవన్ సహా నలుగురి బ్యాగులను తనిఖీ చేయగాసుమారు రూ.2.20 కోట్ల నగలను స్వాధీనం చేసుకున్నారు.
భీమవరంలో ఆరు కిలోల బంగారం.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు ఆరుకిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భీమవరంలో ఓ కారులో సోదాలు నిర్వహించగా 6 కిలోల బంగారం దొరికింది. బిల్లులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.
కర్నూలు జిల్లాలో ..
కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం, అమకతాడు గ్రామ శివారులోనిటోల్ ప్లాజా సమీపంలో కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహన తనిఖీల్లో రూ.4 కోట్ల బంగారం, వెండి దొరికింది. హైదరాబాదు నుంచి కోయంబత్తూరు వెళుతున్నసురేష్ స్వామి అయ్యప్ప ప్రైవేట్ స్లీపర్ ఏసీ ట్రావెల్స్ బస్సులో నలుగురు వ్యక్తుల వద్ద నుండి బంగారం , వెండి తో పాటు భారీగా నగదు ను వెల్దుర్తి సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నంద్యాల టౌన్ కు చెందిన అమర్ ప్రతాప్ పవర్ నుంచి వద్ద రూ. కోటి ఇరవై లక్షల నగదు, ఇక తమిళనాడు కోయంబత్తూర్ కి చెందిన వెంకటేష్ రాహుల్ నుంచి 3.195 కిలోల బంగారం, రూ. 19.23 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్ చెందిన సెంథిల్ కుమార్ నుంచి రూ.44.50 లక్షల నగదు, 1. 37 కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక శబరి రాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లుస్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 4 .59 కోట్ల లెక్క తేలని సొత్తును స్వాధీనం చేసుకున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ వెల్లడించారు.