Tuesday, November 19, 2024

Delhi: ప్రాంతీయ పార్టీల విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజధాని పరిష్కారం కాదన్న రాఘవులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పటిష్టంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు మండిపడ్డారు. న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణ పరిణామాలపై చర్చించామని తెలిపారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని రాఘవులు ఖండించారు. నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎర వేయాలని చూసినట్టే, గతంలోనూ మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఇదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించిందన్నారు.

బీజేపీ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం లేనట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా డబ్బుతో కొనుగోలు చేయొచ్చని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ భారతీయ జనతా పార్టీ చర్యలను ఖండించాలని, ఎన్నికల ప్రతిష్టను నిలబెట్టేలా పార్టీలు వ్యవహరించాలని రాఘవులు పిలుపునిచ్చారు. గవర్నర్లు, డబ్బుని వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసేలా, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, ఫెడరల్ వ్యవస్థను కాపాడేందుకు కలిసి వచ్చే వారిని సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాలని కేంద్ర కమిటీ భావించిందని వెల్లడించారు. కేంద్ర విధానాల వల్ల ప్రజా సమస్యలు, ధరలు పెరుగుతున్నాయన్న ఆయన, భవిష్యత్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఉద్యమాలకు సీపీఎం మద్దతిస్తుందని తెలిపారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి
నవంబర్ 12న ప్రధాని విశాఖ పర్యటనలో ఏపీ సమస్యలపై ప్రకటన చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. విభజన జరిగిన నాటి నుంచి ఏపీకి బీజేపీ ద్రోహం చేస్తుందని, ప్రత్యేక హెూదా లేదని స్పష్టం చేసి తీరని అన్యాయం చేసిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టట్లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణపై ఏడాదిగా ఉద్యమం చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. రైల్వే జోన్ వల్ల ఉపయోగం లేకుండా చేస్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజధాని ఏర్పాటు పరిష్కారం కాదని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని రాఘవులు విజ్ఞప్తి చేశారు. మోదీ పర్యటనలో ఏపీ సమస్యలపై ఒక ప్రకటన వచ్చేలా అన్ని పార్టీలు కృష్ణ చేయాలని కోరారు.

- Advertisement -

మీటర్లకు మోటర్ల విషయంలో తగ్గేది లేదు
అనంతరం సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వం అమరావతి రైతుల పాదయాత్రకు అవరోధాలు కల్పించడం సరి కాదన్నారు. అమరావతి రైతుల పాదయత్రకి రక్షణ కల్పించాలని కోరారు. విశాఖ, ఉత్తరాంధ్రలో సామరస్యాన్ని కాపాడాలే తప్ప విద్వేషాలు రెచ్చగొట్టేలా చేయొద్దని ఆయన వేడుకున్నారు. ఏపీకి బీజేపీ చేసిన ద్రోహాన్ని ఎవ్వరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. బీజేపీ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వామపక్ష పార్టీలపై దాడి చేస్తోందని విమర్శించారు. మోటర్లకు మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఏపీ ప్రభుత్వం కూడా మోటర్లకు మీటర్ల విషయంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

మోటర్లకు మీటర్లు పెట్టి రైతులపై భారం వేస్తే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళుతుందని శ్రీనివాసరావ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో 18లక్షల పంపు సెట్లకి మీటర్లు బిగిస్తే ఆరు వేల కోట్ల భారం పడుతుందని చెప్పుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో మీటర్ కంపెనీలను ఉద్దరించడానికి మీటర్ల పెట్టడానికి ముందుకు వెళితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడ్డారు. అసైన్డ్ భూముల విషయంలో కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయాలని, ప్రత్యేక కమిటీ వేసి వాటిని పేదలకు అప్పగించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణపై ప్రధానితో ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement