Thursday, November 21, 2024

Delhi: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. ఏపీలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే : తులసి రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పాలిట శనిగ్రహం అని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మీడియా సెంటర్ వద్ద మాట్లాడిన తులసి రెడ్డి, బీజేపీ చేసిన మోసం, ద్రోహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయపార్టీలన్నీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాయని తులసి రెడ్డి ఆరోపించారు. కబాలి తరహాలో కట్టుబానిసల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఓట్లు పడ్డాయని, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇలాగే జరుగుతుందని ఆయన సూత్రీకరించారు.

మొత్తంగా బీజేపీలో ‘బీ’ అంటే బాబు, ‘జే’ అంటే జగన్, ‘పీ’ అంటే పవన్ అన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. వీరిలో ఎవరికి ఓటు వేసినా అంతిమంగా అది బీజేపీకి వేసినట్టేనని తులసిరెడ్డి సూత్రీకరించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రూ. 5 లక్షల కోట్లు విలువచేసే ప్రాజెక్టులు, హామీలు పొందుపరిచిందని, కానీ ఏదీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు మంగళం పాడారని, కడప స్టీలు ప్లాంటుకు నామం పెట్టారని, దుగరాజపట్నం పోర్టుకు తిలోదకాలనిచ్చారని, చివరకు పోలవరం ప్రాజెక్టును కూడా ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన విద్యాసంస్థల విషయంలోనూ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు.

ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ప్రాంతీయ పార్టీలు సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నాయని, ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు వాస్తవాన్ని గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. ఉడుత ఊపులకు చింతకాయలు రాలవని, అలాగే ప్రాంతీయ పార్టీలతో ఏదీ సాధ్యం కాదని, కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అన్ని హామీలు సాధ్యపడతాయని తులసి రెడ్డి అన్నారు. దుష్టచతుష్టయంగా మారిన టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో’ యాత్రను ఖరారుచేసే క్రమంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు తాను ఢిల్లీ వచ్చినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఈ యాత్ర మొదలవుతుందని, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో నాలుగు రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుందని వెల్లడించారు. సోనియా గాంధీ ఈడీ విచారణ అంశంపై మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు.

తాము సత్యాగ్రహం అనే ఆయుధంతోనే బీజేపీ కక్షసాధింపు రాజకీయాలను ఎదుర్కొంటామని తెలిపారు. గతంలో జనతా ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని, కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు జనతా పార్టీకి బుద్దిచెప్పి ఇందిరా గాంధీని తిరుగులేని మెజారిటీతో గెలిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement