కర్నూలు – కర్నూల్ రైల్వే స్టేషన్లో అమృత్ రైల్వే దక్షిణ భారత్ పథకం కింద అభివృద్ధి పనులను దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంకు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఆయనతోపాటు ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్, మేయర్ బి వై రామయ్య, రైల్వే దక్షిణ భారత అధికారి అనిల్ కుమార్, బిజెపి జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి, ఉపాధ్యక్షులు రాఘవేంద్ర, మహిళ నాయకురాలు గీతా మాధురి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ వర్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కర్నూలు రైల్వే అభివృద్ధికి తనవంతుగా కృషి చేసినట్లు పేర్కొన్నారు. కర్నూల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి నిమిత్తం గత ఎంపీ, తాను ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన నిధులను తెప్పించగలిగామన్నారు. రైల్వే అధికారులు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. రైల్వే అధికారులు దక్షిణ భారత రైల్వే ప్రాజెక్టులపై అలసత్వం వహిస్తూ చిను చూపు చూస్తున్నారని ఆరోపించారు.
అలాగే రైల్వే ప్రాజెక్టులు తానే తీసుకొచ్చాననీ చెబుతుండగా బిజెపి నేతలు రామస్వామి ఆధ్వర్యంలో ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేశారు. వేదిక మీదికి దూసుకెళ్లారు. గత నాలుగేళ్లుగా కనబడని ఎంపీ.. రైల్వే ప్రాజెక్టులను తానే తీసుకొచ్చాన ని చెప్పడం హాస్యాస్పదం ఉందన్నారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి కర్నూలు జిల్లాలో ఎన్నో పథకాలపై నిధులు తెప్పించిన ఘనత సంజీవ్ కుమార్ ది అన్నారు.
జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బి వై రామయ్య మాట్లాడుతూ కర్నూల్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గతంలో కోట్ల కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ రహితంగా చేసిన సేవలను గుర్తించడం సహజంగా పేర్కొన్నారు. కర్నూల్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ. 42 కోట్ల నిధులను కేటాయించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లు నాయకల్లు అరుణ, సిద్ధారెడ్డి రేణుక తదితరులు పాల్గొన్నారు.