Friday, November 22, 2024

Delhi | కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం.. ఏపీలో పొత్తులపై సోము వీర్రాజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కుటుంబ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా వ్యతిరేకమని, అలాంటి పార్టీలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, సమావేశాలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పొత్తులు, జనసేన వ్యవహారశైలి గురించి ప్రశ్నించగా.. తాము రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల గురించి ఎప్పటికప్పుడు అధిష్టానానికి చెబుతున్నామని అన్నారు.

అయితే కుటుంబ రాజకీయాలు చేసే పార్టీలతో మాత్రం తాము కలిసి నడిచేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. కార్యవర్గ సమావేశాల గురించి మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై సమావేశాల్లో ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చినట్టు వెల్లడించారు. 6వేలకు పైగా ప్రజాపోరు యాత్రలు నిర్వహించామని, సభలు, కార్నర్ మీటింగులతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. జాతీయస్థాయిలో ఆర్థిక, సామాజిక, రాజకీయాంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్టు చెప్పారు.

జీ-20 సదస్సుతో దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, ఈ నేపథ్యంలో జీ-20 సదస్సు గురించి దేశవ్యాప్తంగా 200 సమావేశాలు పెట్టాలని నిర్ణయించినట్టు సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా బీజేపీని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడం గురించి చర్చించామని అన్నారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేలా అధినేతల ప్రసంగాలు జరిగాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement