అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఏపీపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలు తాజాగా తీసుకుంటున్న కొన్ని కీలకమైన నిర్ణయాల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మలుపు తిరగబోతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ పార్టీకి అనుకూలమో ..ఎవరికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయనదే ఇప్పటికిప్పు డు ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ సాధారణ ఎన్నికల సమయానికి అధికార వైసీపీకే మరింత అనుకూలంగా మారుతాయన్న వాదన రాజకీయ వర్గాల్లోనూ, విశ్లేషకుల్లోనూ బలంగా వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఈ నెల 18వ తేది ఢిల్లి కీలకమైన సమావేశాన్ని నిర్వహించ బోతుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి జనసేన పార్టీని మాత్రమే ఆహ్వానించడాన్ని బట్టి చూస్తుంటే బీజేపీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలసి పోటీ చేసే ఆలోచన లేదని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. 2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశంతో కలిసి జనసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా పోటీచేసి అధికార వైసీపీని ఓడించాలని పావులు కదుపుతు న్నట్లు నిన్న మొన్నటి వరకు అంతా భావిస్తూ వచ్చారు. పొత్తులు కుదిరిపోయినట్లు సీట్ల సర్దుబాటు విషయంలోనే చర్చలు జరుగుతున్నా యని 2014 తరహాలోనే మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నా యంటూ పెద్దఎత్తున ప్రచారం కూడా సాగింది.
ఇదే సందర్భంలో తెలుగుదేశంలోని ఓ వర్గం బీజేపీతో కలిసి పోటీ చేస్తే ముస్లిం, మైనార్టీ ఓట్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లు కూడా దూరం చేసుకోవాల్సి వస్తుందని టీడీపీ అధినాయకత్వానికి చెబుతూ వస్తుంది. అయితే రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్‌ను ఢీకొట్టాలంటే మిత్రపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తుండడంతో ఆ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రెండు , మూడు సంవత్సరాలుగా జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలనే యోచనతోనే ఉన్నారు. ఇదే అంశాన్ని ఆయన పలు సందర్భాల్లో కూడా వ్యక్తపరిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యమని, అందుకోసం అవసరమైతే తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తానని అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చెబుతూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ తెలుగుదేశానికి హ్యాండ్ ఇస్తూ ఎన్డీఏ సమావేశానికి జనసేనను మాత్రమే ఆహ్వానించడం వెనుక సరికొత్త వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతుంది.
ఏపీపై మారుతున్న .. కేంద్ర వ్యూహం
తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ ఇప్పటికే తెలంగాణలో ఒంటరిగా తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఏపీలో కూడా జనసేనతో కలిసి పోటీకి సిద్ధమవుతున్న కమలనాథులు ఏపీలో సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుని దగ్గుబాటి పురందేశ్వరికి రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. ఇదే సందర్భంలో తెలుగుదేశాన్ని దూరం పెడుతూ ఎన్డీఏ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రమే ఆహ్వానం పంపింది. దీన్నిబట్టి చూస్తుంటే త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నట్లు కేంద్రం సంకేతాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదే సందర్భంలో అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడానికి జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న తెలుగుదేశాన్ని ఎన్డీఏ సమావేశానికి పిలవకపోవడాన్ని బట్టి చూస్తుంటే ఏపీలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒంటరి పోరు తప్పేలా లేదు.అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తో కలిసి పోటీ చేసిన బీజేపీ .. 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి దూరంగా జనసేనతో కలిసి బరిలోకి దిగిన కమలనాథులు 2024 ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో ముందుకు సాగబోతున్నారని స్పష్టమవుతోంది. రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాజాగా బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏ పార్టీకి లాభాన్ని చేకూరుస్తుందో అన్న అంశంపై కూడా భిన్నాభిప్రా¸లు, భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సైకిల్‌కి ఒంటరి పోరు తప్పేలా లేదు
2019 ఎన్నికల్లో అధికారానికి దూరమై ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన తెలుగుదేశం 2024 ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు సంవత్సరాలుగా వివిధ రకాల కార్యక్రమాలు ఆందోళనల పేరుతో ప్రజల్లోనే ఉంటున్నారు. అధికార వైసీపీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ఆందోళన కూడా చేపడుతూ వస్తున్నారు. ఇదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పలు సందర్భాల్లో సమావేశమై రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు అంశాలపై చర్చించారు. ఉమ్మడిగా కలిసి ప్రభుత్వంపై పోరుబాట నడపాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇదే సందర్భంలో గత నెలలో చంద్రబాబు ఢిల్లిd వెళ్లి బీజేపీ పెద్దలన కూడా కలిశారు. అంతకుముందు పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన పలు బిల్లులకు కూడా తెలుగుదేశం ఆమోదం తెలిపింది. దీంతో మిత్రపక్షాలుగా టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయబోతున్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపించింది. ఆయా పార్టీల్లోని ఓ వర్గానికి చెందిన నేతలు కూడా పొత్తులు నిజమేనని చెబుతూ వచ్చారు. అయితే త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఢిల్లిdలో ఎన్డీఏ ఆధ్వర్యంలో తలపెట్టిన కీలకమైన సమావేశానికి తెలుగుదేశాన్ని పిలకపోవడాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రంలో మరోసారి 2019 తరహాలోనే తెలుగుదేశం ఒంటరి పోరుతో బరిలోకి దిగే వాతావరణం కనిపిస్తుంది.
కాషాయం తాజా నిర్ణయంతో .. వైసీపీకి మరింత అనుకూలంగా మారే అవకాశం
లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి నిధులను కేటాయించడంలోనూ , పెండింగ్ బకాయిలను విడుదల చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తుంది. ఆయన ఢిల్లిd వెళ్లిన ప్రతిసారి కేంద్ర పెద్దలతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక రూపంలో నిధులను సమకూర్చుకుని వస్తున్నారు. తాజాగా పోలవరం పూర్తికి కూడా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టే పలు బిల్లులకు మద్దతు ఇస్తూ వస్తుంది. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపొందాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఆ దిశగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకొస్తున్నారు.
అయితే తెలుగుదేశం , జనసేన కలిసి పోటీ చేస్తే ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రెండు పార్టీలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇదే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. అయితే మొదటినుంచి జనసేనను ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు సవాల్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని, అందుకు అవసరమైతే తెలుగుదేశంతో కలిసి బరిలోకి దిగి వైసీపీని ఇంటిబాట పట్టిస్తామని పవన్ కళ్యాణ్ పదేపదే హెచ్చరిస్తూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీని దూరం పెడుతూ జనసేనను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించింది. కాషాయం తీసుకున్న తాజా నిర్ణయంతో అధికార వైసీపీకి రాష్ట్రంలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడబోతుంది. ఇదే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో కూడా వ్యక్తమవుతోంది.