Friday, November 22, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై బిజెపి ఫోక‌స్…

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మండలి ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడం తో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. తాజాగా వైసీపీ స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటా అభ్యర్థలను ఖరారు చేయగా.. ఇప్పటికే టీచర్‌, పట్టభద్రు ల నియోజకవర్గాలకు అభ్యర్థు లను ఎంపిక చేసి ప్రచారం ముమ్మరం చేసింది. రాష్ట్రంలో రానున్న ఎన్ని కల్లో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ.. మూడు పట్టభద్రుల నియో జకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థు లను ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుపై రాష్ట్ర బీజేపీ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. మూడింటిలో రెండు గెలుపు ఖాయమనే ధీమాతో బీజేపీ ఉంది. ప్రతి నియోజకవర్గానికి కీలక నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో పాటు ప్రచారానికి కేంద్ర, రాష్ట్ర నేతలు సమాయత్తమవుతున్నారు. ఎలాగూ మోడీ ప్రభావం ఎన్నికలపై బలంగా ఉండనే ఉందనేది బీజేపీ నేతలు అభిప్రాయం. కడప-అనంతపురం-కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో బీజేపీకి గట్టు పట్టుందని బీజేపీ నేతలు చెపుతున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌తో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్థన్‌ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ నేత డాక్టర్‌ పార్థసారధి, రాష్ట్ర కార్యదర్శి నాగోతి రమేష్‌ నాయుడు సహా అనేక మంది కీలక నేతలు మూడు జిల్లాల్లో ఉన్నారు.

గతంలో రాయల సీమ డిక్లరేషన్‌ ద్వారా రాయలసీమ అభివృద్ధిపై పలు ఆందోళనా కార్యక్రమాలను బీజేపీ నిర్వహించింది. రాయల సీమ ప్రాజెక్టులపై సోము వీర్రాజు నేతృత్వంలో ఆందోళనలు సైతం నిర్వహిం చారు. పార్టీ పటిష్టంగా ఉన్నందున గెలుపు అవకాశా లు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ నేతలు చెపుతున్నారు. ఇదే సమయంలో ప్రకాశం- చిత్తూరు- నెల్లూరు జిల్లాలతో
కూడిన తూర్పు రాయలసీమ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర రెడ్డి గెలుపుపై కూడా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.

ఉత్తరాంధ్రలో ఢోకా లేదు
ఉత్తరాంధ్రలో బీజేపీకి బలమైన కేడర్‌ ఉన్నందున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ గెలుపు నల్లేరు మీద నడకేనని రాష్ట్ర నాయకత్వం చెపుతోంది. గతంలో తెదేపా మద్దతుతో పోటీ చేసి మాధవ్‌ గెలుపొందారు. ఈసారి సొంత బలం భారీగా పెరిగినందున అవకాశాలు ఎక్కువేనని చెపుతున్నారు.

అయినప్పటికీ..
ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ.. ఏమాత్రం ఎమరు పాటు కూడదంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం పార్టీ నేతలు, శ్రేణులను అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే కీలక నేతలకు నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించారు. వీరికి 18 రోజుల టాస్క్‌ ఇచ్చారు. వీరంతా ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ విస్తృత ప్రచారం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లడం ద్వారా బీజేపీకి ఓటేయాల్సిన అవసరాన్ని వివరించనున్నారు. తద్వారా పార్టీ అభ్యర్థుల గెలుపు సులువు అవుతుందనేది రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం. మరి పట్టభద్రులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement