Saturday, November 23, 2024

హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యపై ఫిర్యాదు.. ఎంపీ గోరంట్ల జాడ లేదన్న బీజేపీ

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ ఉద్ధృతం అవుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు నిన్న పట్టణంలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ఈప్రాంత ప్రజాప్రతినిధులలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి హిందూపురం కోసం జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వాగతించారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్రం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బాలకృష్ణ అన్నారు. వాణిజ్య పరంగా, పారిశ్రామిక పరంగా కూడా హిందూపురం అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. కాబట్టి హిందూపురం పార్లమెంట్‌ను జిల్లా కేంద్రాన్ని ప్రకటిస్తూ.. శ్రీసత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిందూపురం పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి పుష్కలంగా ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement