త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలోనూ విషాదం నింపింది. బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పని చేస్తున్న సాయితేజ ఢిల్లీలో ఉంటున్నారు. ఏడాది క్రితమే ఆయన తన కుటుంబాన్ని మదనపల్లెకు మార్చారు. నిన్న ప్రమాదం జరగడానికి ముందు సాయితేజ ఉదయం 8 గంటల సమయంలో భార్య శ్యామలకు వీడియో కాల్ చేశారు. కుమార్తె దర్శినిని చూడాలని ఉందని భార్యకు చెప్పారు. అనంతరం అందరితో మాట్లాడిన ఆయన ఆ తర్వాత కాసేపటికే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు.
కాగా, తమిళనాడులో బుధవారం(డిసెంబర్ 8) త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్‌లోని సైనిక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.