Friday, November 22, 2024

సీమలో బయోడీజిల్ వ్యాపారం.. కల్తీ డీజిల్ తో దెబ్బతింటున్న వాహనాలు..

కర్నూలు, (ప్రభ న్యూస్‌) : నంద్యాల అడ్డాగా బయోడీజల్‌ దందా యథేచ్ఛగా సాగుతున్నది. కల్తీ డీజిల్‌ ప్రభావంతో వాహనాలు దెబ్బతింటుండగా, ఆ వాహనాల నుండి వచ్చే కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం కూడా పాడవుతోంది. నంద్యాల కేంద్రంగా కోట్ల రూపాయల కల్తీ బయోడీజల్‌ వ్యాపారం జరుగుతున్నా అధికారులు అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. రాయలసీమ మొత్తానికి అనుమతులు ఉన్న బయోడీజల్‌ బంకులు కేవలం మూడు మాత్రమే. అవి కూడా కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు, బన్నూరులలో మాత్రమే ఉన్నాయి. వీటిలో మాత్రమే ప్రభుత్వ నిబంధనలకు లోబడి సురక్షిత బయోడీజల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. కల్తీ డీజల్‌ మాఫియాతో స్థానిక అధికారులు కొందరు చేతులు కలపడంతోనే యథేచ్చగా వీరి వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది.

మామూలు డీజల్‌ రేట్లతో పోలిస్తే రూ.10 నుండి రూ.15 నంద్యాల ఆటోనగర్‌లో లభిస్తున్న బయోడీజల్‌ తక్కువగా ఉండటంతో కొందరు వాహనదారులు ఈ డీజల్‌ కోసం ఎగపడుతున్నారు. డ్రమ్ముల కొద్దీ కొనే వారు కొందరైతే కొందరు లారీలు తీసుకువచ్చి ఫుల్‌ ట్యాంకు చేయించుకొని మరీ వెళ్తారు. ముంబై నుండి నేరుగా నంద్యాలకు ట్యాంకర్ల ద్వారా దిగుమతి చేసుకొని ఈ చీకటి దందా సాగిస్తున్నా అడ్డుచెప్పే నాథుడే లేడు. తమ వ్యాపారం దెబ్బతింటుందని స్థానిక డీజల్‌ బంకు వ్యాపారులు మొత్తుకుంటున్నా అటువైపు చూసేందుకు సంబంధిత అధికారులు జంకుతున్నారు.

నిజానికి వాహనాల స్పేర్‌పార్ట్స్‌(విడిభాగాలు) శుభ్రపరచడానికి కొన్ని పెయింటింగ్‌లలో కలిపేందుకు బయోడీజల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే నేడు ఏకంగా వాహనాలు నడిపేందుకు కల్తీ బయోడీజల్‌ను వాడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులకు నెలమామూళ్లు ముట్టజెబుతుండటంతోనే ఈ వ్యవహారం సజావుగా సాగుతున్నట్లు సమాచారం. హైదరాబాదు నుండి నంద్యాల మీదుగా వెళ్లే వాహనదారులకు చాలావరకు ఇక్కడ బయోడీజల్‌ దొరుకుతుందన్న సమాచారం ఉండటంతో వాహనాలను పక్కన పెట్టి మరీ బయోడీజల్‌ కొనుగోలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement