Saturday, November 23, 2024

వైద్యశాఖలో ‘బయో’ మెట్రిక్‌ చిచ్చు.. ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా, బోధన, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఈ విధానం అమలు కానుంది. గతంలోనే ఈ విధానం ఉన్నప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. వైద్యశాఖ కమిషనరేట్‌ ఉత్తర్వులు నేపథ్యంలో బయోమెట్రిక్‌ వ్యవస్థ ఏర్పాటు పనులు ఆఘమేఘాలపై జరిగాయి. ఇందుకోసం ఆసుపత్రుల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. విధులకు వచ్చి అనుమతి లేకుండా బయటకు వెళితే సెలవల్లో కోత ఉంటుందనే ఆదేశాలను జారీ చేశారు. వైద్యులతో పాటు సిబ్బంది డ్యూటీ సమయాల్లో ఆసుపత్రుల్లో ఉండకుండా సొంత పనుల్ని చక్కబెట్టుకుంటున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రి బాట పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వశాఖల తరహాలోనే బయోమెట్రిక్‌తో వైద్యశాఖ ఉద్యోగుల్ని కట్టడి చేయాలని సర్కార్‌ నిర్ణయించింది.

సెల్ఫీల్లేవ్‌
వైద్య సిబ్బంది ఆసుపత్రుల్లో ఉన్నట్లు ప్రతి రెండు గంటలకు ఒకసారి వెబ్‌సైట్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలంటూ వైద్యశాఖ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ వైద్యులు ప్రతి రెండు గంటలకు ఒకటి చొప్పున సెల్ఫీలు తీసి వైబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఆ నెల జీతంలో కోత పడుతోందని హెచ్చరించారు. సెల్ఫీ విధానానికి సంబంధించి మహిళా వైద్యులు, సి బ్బంది నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో పాటు, సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ విధానాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

సాధ్యమేనా
సమస్యలు పరిష్కరించకుండా కచ్చితంగా విధులు నిర్వహించడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలు వైద్యులు, సిబ్బంది లేరు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు షిప్టుల్లో డ్యూటీలు చేయాల్సిందిగా వైద్యశాఖ కమిషనర్‌ తాజాగా ఆదేశాలిచ్చారు. కొన్ని పీహెచ్‌సీల్లో ఒక్క డాక్టరే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు డ్యూటీ చేయడం ఎంత వరకు సాధ్యం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గిరిజన ప్రాంతాల్లో పీహెచ్‌సీలు ఊరికి దూరంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రోగి బంధువులు మద్యం సేవించి ఆసుపత్రులకు వచ్చి గొడవ చేస్తారని, కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులు చేస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేసే మహిళా డాక్టర్లకు భద్రత కొరవడుతోందని వాపోతున్నారు. వైద్యులకు నిర్ణీత వేళలు నిర్ణయించిన కమిషనర్‌ ల్యాబ్‌టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌ ఇతర సిబ్బంది సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోయే వెసులుబాటు కల్పించారు. సిబ్బంది లేకుండా తాము ఒక్కళ్ళమే ఎంత వరకు వైద్య సేవలు అందించగలమని పీహెచ్‌సీ వైద్యులు ప్రశ్నిస్తున్నారు.

సమస్యల సంగతేంటి
పీహెచ్‌సీలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లు వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జయధీర్‌ ‘ఆంధ్రప్రభ’కు తెలిపారు. ఆసుపత్రులకు సమీపంలో క్వార్టర్స్‌ లేవు, వాహనాలు లేవు ఈక్రమంలో కాల్‌డ్యూటీ చేయాలంటే ఎలా సాధ్యం అవుతోందని ఆయన ప్రశ్నించారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు స్టాఫ్‌ నర్సు ఒక్కరే ఆసుపత్రిలో ఉండి వైద్యసేవలు అందించలేరన్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా వైద్యశాఖలో సంస్కరణలు ఎలా సాధ్యమవుతాయని ఆయన ప్రశ్నించారు. గత రెండు రోజులుగా జూమ్‌ మీటింగ్‌ ద్వారా వైద్యులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నానని, త్వరలోనే ప్రభుత్వ పెద్దల్ని కల్సి తమ సమస్యలు పరిష్కరించాలని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement