Monday, October 7, 2024

AP | కర్నూలు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన జి.కృష్ణకాంత్ నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఇక‌ ఆయన స్థానంలో గరికపాటి బిందుమాధవ్ కర్నూలు జిల్లా ఎస్పీగా సోమవారం జల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని… మహిళల భద్రత, మహిళలపై నేరాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామన్నారు.

సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక నిఘా పెడతామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారం, సమన్వయంతో కలిసి పని చేస్తామన్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క బాధితుడికి తక్షణమే పరిష్కారం అందించేందుకు కృషి చేస్తాం అని తెలిపారు.

జిల్లా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసి నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని…. ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామన్నారు. సీసీ కెమెరాల నిఘా పటిష్టం చేస్తాం తెలిపారు. జిల్లా పోలీసు శాఖకు జిల్లా ప్రజలు, మీడియా సహకారం అందించాలని కోరారు.

- Advertisement -

నూతన ఎస్పీ గరికపాటి బిందుమాధవ్ గురించి…

2017 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన బిందు మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడకు చెందినవారు. ఐపిఎస్ శిక్షణ పూర్తిచేసి తొలుత ప్రకాశం జిల్లాలోని గ్రేహౌండ్స్ లో విధులు నిర్వర్తించారు.. రంపచోడవరంలో ఏఎస్పీగా, గుంటూరు సెబ్ జాయింట్ డైరెక్టర్ గా, పల్నాడు అదనపు ఎస్పీగా, ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత గ్రేహౌండ్స్ లో, పల్నాడు జిల్లాలో ఎస్పీగా పని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement