అమరావతి, ఆంధ్రప్రభ : ఆకలికి రుచి తెలీదు.. నిరుద్యోగానికి హోదాతో పనిలేదు.. ఇవే ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగార్ధుల నినాదాలు.. చదివింది పెద్ద చదువులే అయినా చిన్న కొలువులతో బతికేద్దాం.. అంటూ కేవలం కానిస్టేబుల్ పోస్టు కోసం పీహెచ్‌డీలు సైతం పోటీ పడుతున్నారు. దీనిబట్టి రాష్ట్రంలో నిరుద్యోగం ఏస్ధాయిలో ఉందో అర్ధమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. పైగా మూడేళ్ళ కరోనా కాలం పెట్టిన పరీక్షలో నెట్టుకొచ్చిన అనుభవం నేర్పిన పాఠం బతుకుదెరువునే గుర్తు చేస్తోంది గాని, హోదా కోరుకోవడం లేదు. అందుకే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి అంత డిమాండు వచ్చింది. పోలీసుశాఖలో 6,511 ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ జారీ చేస్తే వీటిలో 6,100 పోస్టులు కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలే. వీటి కోసం దాదాపు 5 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారంటే పరిస్ధితి అర్ధమవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగమైతే చాలు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం కావాలనుకుంటే ఎలా అనుకున్న యువత విద్యార్హతలతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంటే కానిస్టేబుల్ పోస్టులను తక్కువగా చూడటమని కాదు.. కనీస విద్యార్హత ఇంటర్మీడియేట్ ఉంటే చాలు. కాని ఇంజనీరింగ్, పీహెచ్‌డీలు చదివిన ఎంతోమంది పోటీలో నిలబడటమంటే వారు చదివిన పెద్ద చదువులకు తగిన ఉద్యోగం రావచ్చు.. రాకపోవచ్చు. తాము కోరుకునే ఉద్యోగం కంటే.. వచ్చిన అవకాశం వదులుకోకూడదనేది వారి అంతరార్ధం. ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగం కదా.. కరోనా సంక్షోభాన్ని చవి చూసిన బతుకులకు ఉద్యోగ గ్యారంటీ ఉంటుందన్న అభిప్రాయం.
ఉన్నత చదువులు ఎంతమందంటే..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జరుగుతున్న నియామక పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా వీరందరికీ ఇప్పటికే హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి. ఈనెల 22వ తేదీన జరిగే ప్రిలిమినరీ రాత పరీక్షకు అభ్యర్ధులంతా సన్నద్ధమవుతున్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన అభ్యర్థుల వివరాలు విస్తుగొల్పుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఎంపికయ్యే ఈ పోస్టులకు పది మంది పీహెచ్‌డీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం.
ఇంకా చెప్పాలంటే దరఖాస్తు చేసుకున్నవారిలో 94మంది ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్థులు, 13,961మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇంటర్మీడి యెట్ విద్యార్హత ఉన్న వారు 2,97,655 మంది అయితే, బిఎస్సీ చదివిన వారు 61419, బికాం చదివిన వారు 40548 మంది అభ్యర్ధులు ఉన్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన బిటెక్ అభ్యర్థులు 31,695 మంది, ఎంబిఏ అభ్యర్థులు 5284 మంది, ఎమ్మెస్సీ అర్హత ఉన్నవారు 4365మంది, ఎంఏ చదివిన వారు 1845 మంది, ఎంకాం చదివిన వారు 1527 మంది, ఎంటెక్ చదివిన వారు 930మంది ఉన్నారు. బిఏ చదివిన వారు 21,024 మంది ఉన్నారు.
పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ రెండేళ్లు చదివి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 16,945 మంది , డిప్లొమా చదివిని వారు 15,254 మంది, ఇతర డిగ్రీలు చదివిన వారు 4,134మంది ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌తో నిరుద్యోగుల్లో భారీ పోటీ- నెలకొనడంతో ఒక్కో ఉద్యోగానికి దాదాపు 82.5 మంది ప్రాథమిక స్థాయిలో పోటీ పడుతున్నారు.
22న ప్రిలిమినరీ..
కానిస్టేబుల్ కొలువులకు ఈ నెల 22న జరిగే ప్రాథమిక పరీక్ష జరుగనుంది. ఇందుకు సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పరీక్షా కేంద్రాల ఎంపిక, పరీక్ష నిర్వహణ బాధ్యత, విధానం తదితర వాటికి సంబంధించి కసరత్తు మొదలైంది. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులకు 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. 3580 సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు ఏపీఎస్పీలో 2520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గత ఏడాది నవంబర్ 28న జారీ అయిన నోటిఫికేషన్ ప్రక్రియ మొదలు తుది వరకు నిర్వహించే అన్ని దశల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలన్నది ప్రభుత్వం ఉద్ధేశ్యం. దీనిలో భాగంగా 22వ తేదీన జరిగే ప్రాధమిక పరీక్షకు కావాల్సిన హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్‌కు ఈనెల 20వ తేదీ తుది గడువు.
ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 కలిపి 200 మార్కులకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటు-ంది. పరీక్ష సమయం 3 గంటలు కాగా ఓఎంఆర్ విధానంలోనే రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతంగా నిర్ణయించారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు100మీటర్లు, 1600 మీటర్ల పరుగు ఈవెంట్లు- నిర్వహించి, అర్హులైన వారిని ఫైనల్ పరీక్షకు బోర్డు ఎంపిక చేస్తుంది. తుది పరీక్షలో సాధించే మార్కుల మెరిట్ ఆధారంగా రిజర్వేషన్లు రోస్టర్ పద్దతిలో అమలు చేస్తుంది.