Friday, November 22, 2024

Big Story: ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్.. ఇక నిత్యం ప్రజల్లోనే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రజాదరణ పొందిన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇటీవ‌ల కాలంలో ఏ ఎన్నికలు జరిగినా విజయ దుందుభి మోగిస్తోంది. సీఎం జగన్మోహ‌న్‌రెడ్డి పాలనపై ప్రజలకు ఇంకా విశ్వాసం పెరిగింద‌నేందుకు ఇదే ఉదాహరణ. ఈ తరుణంలో వైఎస్ జగన్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. అదేంటంటే..

2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో భారీ విజయం సాధించింది. పాదయాత్రతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొత్తం చుట్టివచ్చిన జగన్.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు క‌ళ్లారా చూసి.. వారి మాట‌లు విన్నారు. ఆ సంద‌ర్భంగా వారికి తాను అధికారం చేప‌డితే ఏ ప‌నులు చేస్తానో అనే దానిపై ఒక్కో జిల్లాలో ఒక్కో హామీ ఇచ్చారు.

ఆ త‌ర్వాత ఆయ‌న నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan). అధికారం చేపట్టి సంవత్సరం తిరగకుండానే కరోనా మహమ్మారి వచ్చి పడింది. కొత్త రాష్ట్రంలో ఆర్థిక‌ ఇబ్బందులు వెంటాడుతున్నా మహమ్మారిని దృష్టిలో పెట్టుుకుని సాకులు చూప‌లేదు.. సంక్షేమ పథకాల్ని మాత్రం ఆపలేదు.

ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. బహుశా అందుకే ప్రజల్లో కూడా అతనిపై నమ్మకం ఏ మాత్రం సడలలేదని చెప్ప‌వ‌చ్చు. ఈ ఏడాది వరుసగా వచ్చిన పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలన్నింటిలోనూ అధికార పార్టీ వన్ సైడెడ్ విక్టరీ నమోదు చేసింది. ఇటీవల జరిగిన తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో అయితే గతంలో కంటే భారీ మెజార్టీ వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కొంత‌మేర అసంతృప్తి ఉన్నా.. చేప‌డుతున్న అభివృద్ధికి ప్రజలు ఆమోదిస్తూ అండ‌గా నిలుస్తున్నారు.

2019లో అధికారంలో వచ్చేటప్పుడే 2-3 పర్యాయాలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకున్న జగన్ దానికి త‌గ్గ‌ట్టే చర్యలు చేప‌ట్టారు. పరిస్థితి బాగున్నప్పుడు అన్నీ సెట్ చేయాలనేది ఆయన ఆలోచనగా ఉంది. అందుకే ముందస్తు ఎన్నికల ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2024లో ఏపీ అసెంబ్లీకు ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి. కానీ అంతకంటే ముందే అంటే 2023లో ముందస్తు ఎన్నికలకు వెళితే బాగుంటుందనే ఆలోచనలో వైఎస్ జగన్ చేస్తున్న‌ట్టు సమాచారం.

- Advertisement -

అయితే ముందస్తు ఎన్నికలు ఏడాది ముందా లేదా ఆరు నెలలు ముందా అనేది ఇంకా నిర్ణయించలేదు. ఆరు నెలలు ముందుగా అయితే తెలంగాణ ఎన్నికలతో పాటుగా ఏపీ ముందస్తు ఎన్నికలు జరగవచ్చు. లేదా ఏడాది ముందుగా అనుకుంటే కర్ణాటక ఎన్నికలున్నాయి. దేశంలో మరో 2-3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా 2023లో జరగాల్సి ఉన్నాయి. 2023లో ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 అంటే వచ్చే ఏడాదంతా ప్రజల ముందుండాలని నిర్ణయించుకున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత వైఎస్ జగన్ ప్రతి జిల్లాను కలియతిరగనున్నారు. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గాన్ని చుడుతూ నిత్యం ప్రజల్లోనే ఉండేవిధంగా కొత్త షెడ్యూల్ రూపుదిద్దుకుంటోంది. ఈ వార్తలపై ఇంకా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : మాట నిలబెట్టుకునే మగతనం లేదా?: సీఎం కేసీఆర్‌పై షర్మిల హాట్ కామెంట్

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి www.twitter.com/AndhraPrabhaApp www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement