తిరుపతి, ప్రభ న్యూస్ బ్యూరో (రాయలసీ) : కుప్పం నియోజకవర్గంలో రెండు దశాబ్దాల క్రితం మూతపడిన చిగురుగుంట ప్రాంత బంగారు గనులను పునరుద్దరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఏడాది క్రితం సంబంధిత టెండర్‌ను దక్కించుకున్న కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిసి) నిర్వహించిన సాంకేతిక పరీక్షలలో టన్నుకు 5 గ్రాములకు పైగా బంగారం లభ్యమయ్యే అవకాశముందని తేలింది. దీంతో రూ 500 కోట్ల టెండరును దక్కించుకున్న న్‌ఎండిసి సంబంధిత అనుమతుల సాధనకు సన్నాహాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే ఆ ప్రాంతంలోని రెండు పంచాయతీలకు ఆదాయం పెరగడం తో పాటు 3 వేలమందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
జియో లాజికల్ సర్వే అఫ్ ఇండియా అనుబంధ విభాగమైన మినరల్ ఎక్సప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈ సిఎల్) ఆధ్వర్యంలో దాదాపు ఆరు దశాబ్దాల క్రితం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) పరిసరాలలోని వివిధ ప్రాంతాలలో బంగారు ఖనిజాన్వేషణ మొదలైంది. ఆ క్రమంలో కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండల పరిధిలో చేపట్టిన అన్వేషణ ఫలించి చిగురుగుంట, బిసానత్తం గ్రామాల వద్ద బంగారు నిక్షేపాలు ఉన్నట్టు 70 వ దశకం మధ్యకాలంలో తేలింది. బంగారు ముడిపదార్ధమైన క్వార్ట్జ్ రాయిని వెలికి తీసి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని కేంద్ర ప్రభుత్వ అనుబంధ భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ (బిజిఎంఎల్) కు పదేళ్ల పాటు అందజేస్తూ వచ్చింది.
కాలక్రమంలో ఎంఈసిఎల్ సంస్థ ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా మూతపడడంతో ఆ గనులను బిజిఎంఎల్ కొనుగోలు చేసింది. 1982లో కొనుగోలు చేసిన ఆ బిజీఎంఎల్ సంస్థ 2001 వరకు బంగారు ముడిఖనిజాన్నీ వెలికితీస్తూ వచ్చింది. బిజిఎంఎల్ సంస్థ కేజీఎఫ్‌లోని ఛాంపియన్ విభాగం నిర్వహణా పరమైన నష్టాలను ఎదుర్కొనడంతో చిగురుగుంట, బీసానత్తం గనులకు లాకవుట్ ప్రకటించించాల్సి వచ్చింది. మూట పడిన ఆ గనులను తిరిగి ప్రారంభించడానికి 2010-2011 మధ్యకాలం లో మరో ప్రయత్నం జరిగినా అమలుకు నోచుకోలేదు.
కాగా గత ఏడాది మొదలైన మరో ప్రయత్నంలో భాగంగా . కేంద్ర ప్రభుత్వం పిలిచిన -టె-ండర్లలో పలు దిగ్గజ ప్రైవేట్ సంస్థలతో పోటీపడిన ఎన్‌ఎండిసి రెండు గ్రామాల గనులను రూ 500 కోట్ల తో దక్కించుకుంది. మైసూర్‌కు చెందిన జియో అనే సంస్థ ద్వారా ఆ రెండు గ్రామాల పరిసరాలలోని 19 కిలోమీటర్లకు చెందిన 260 హెక్టార్ల భూముల్లో దాదాపు వందకు పైగా బోర్లు తవ్వించి సాంకేతిక పరీక్షల సర్వే చేయించింది., ఆ పరీక్షల్లో మొత్తం 260 హెక్టార్ల బ్లాక్‌లో సేకరించిన 1. 8 టన్నుల మట్టిలో టన్నుకు 5. 5 గ్రాముల వరకు బంగారం లభ్యమయ్యే అవకాశం ఉందని ప్రయోగశాల పరీక్షలు నిర్ధారించాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఈ విషయాలపై గత ఏడాది ఆగష్టు 4న అమరావతిలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆ గనులను తిరిగి మొదలు పెట్టడానికి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలను ఇచ్చారు. ఆ పై ఇప్పటికే లెటర్ అఫ్ ఇంటెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఎన్‌ఎండిసీ లీజు సంబంధిత అనుమతులకు కృషి చేస్తోంది. ఒప్పందంలో భాగంగా వచ్చే ఆదాయంలో 38. 25 శాతం వాటాను ప్రభుత్వానికి ఇవ్వడానికి ఎన్‌ఎండిసి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అవసరమైన అనుమతుల సాధన కోసం ఒక కన్సల్టెన్సీని నియమించుకునే పని లో ఉన్న ఎన్‌ఎండిసి చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లోనే బంగారం శుద్ధి చేసే ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.ఇది ఇలా ఉండగా, ఇరవై ఏళ్ళక్రితం లాక్ ఔట్ చేసినప్పుడు ఆ గనిలో వెయ్యిమందికి పైగా కార్మికులు పని చేస్తుండేవారు. లాకవుట్ జరిగిన తరువాత తమ ఉపాధి సంబంధిత అంశాల పై కోర్టును ఆశ్రయించిన వారిలో దాదాపు 400 మంది పింఛన్లను కూడా పొందారు.
లాక్ ఔట్ అయినా తరువాత ఆ మైన్స్‌లో లోని యంత్ర సామాగ్రి 90 శాతం నిరుపయోగంగా మారిందని తెలుస్తోంది. తాజా మైనింగ్ కార్యక్రమంలో భాగంగా తవ్వే సొరంగాలలో పని చేయడానికి కనీసం రెండు వేలమంది కార్మికులు, మరో వెయ్యి మందికి పైగా నిపుణులు అవసరమని ఎన్‌ఎండిసి అధికారులు భావిస్తున్నారు. అనుకున్న విధంగా అన్ని అనుమతులు వచ్చి మైనింగ్ పనులు మొదలైతే ఇతర అంశాల సంగతెలా ఉన్నా కుప్పం నియోజకవర్గానికి చెందిన వేలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు, ఆ గనుల పరిధికి చెందిన కొత్తూరు, సంగన పల్లె పంచాయతీలకు అదనపు ఆదాయం లభించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.