Saturday, November 23, 2024

Big Story: కొటియా గ్రామాల ప‌రిస్థితి ఏంటి.. ఏపీలోనా, ఒడిశాలోనా?

AP Odisha Border Issue: ఏళ్ల తరబడి కొన‌సాగుతున్న వివాదం ఇది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా సరిహద్దులోని గ్రామాల పరిధి నిర్ణయించే సమస్య ఇది… నిన్నటి భేటీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా ఆ సమస్యపై స్పందించారు. ఇంత‌కీ ఆ విలేజ‌ర్స్ ఏమంటున్నారు.. ఏ స్టేట్‌లో కలవాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన క‌థ ఏంటో చ‌దివి తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా (Ap-Odisha Border) సరిహద్దులోని సాలూరు నియోజకవర్గ పరిధిలోని 5 గ్రామ పంచాయితీల పరిధిలో 16 గ్రామాల‌కు చెందిన‌ కొటియా గ్రూపు గ్రామాల వివాదం చాలాకాలంగా నలుగుతోంది. దాదాపు 15 వేల మంది జనాభాలో 3,813 మంది ఒడిశాలో ఓటర్లుగా ఉన్నారు. 1936లో ఒడిశా రాష్ట్రం ఏర్పాటైనప్పుడు కానీ, 1953లో ఆంధ్రప్ర‌దేశ్‌ ఏర్పడినప్పుడు కానీ ఈ ప్రాంతంలో సర్వే చేయకపోవడంతో సమస్య అట్లాగే ఉండిపోయింది.

ఈ గ్రామ పంచాయ‌తీల ప‌రిధిల‌ను ఏ రాష్ట్రమూ త‌మ అంతర్భాగంగా గుర్తించలేదు. ఫలితంగా ఈ గ్రామాల కోసం రెండు రాష్ట్రాలు 1968 నుంచి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఈ వివాదాన్ని పార్లమెంట్‌లో తేల్చుకోవాలని, అంతవరకూ ఏ విధమైన ఆక్రమణ చర్యలకు పాల్పడవద్దని 2006లోనే న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

అయితే ఈ గ్రామ‌స్తులంతా ఏపీకి చెందినవారే అనేందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపున‌కు సంబంధించి తామ్రపత్రాల్ని ఇటీవల కొటియా ప్రజలు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చ‌దువుకుంటున్నారు.

ఈ గ్రామ‌స్తులంద‌రికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం (Ap Government) మంజూరు చేసిన రేషన్ కార్డులతో పాటు ఏపీ చిరునామాతో ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. త‌మ పూర్వీకుల నుంచి ఆంధ్ర ఆచార సంప్రదాయాల‌నే పాటిస్తున్నందున.. త‌మ‌ను ఏపీకి చెందినవారుగానే గుర్తించాల‌ని ఆ గ్రామాల కొటియా ప్రజలు తీర్మానం కూడా చేశారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) పాలనపై వీరంతా విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

సీఎం జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. అందుకే ఒడిశాలో చేరమని కొటియా ప్ర‌జ‌లు చెబుతున్నారు. మరోవైపు ఈ సమస్యపై తొలిసారిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. ఇరువురి మధ్య సానుకూలంగా జ‌రిగిన చర్చల్లో ప్ర‌త్యేక క‌మిటీ వేసి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement