Telangana, Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు వార్ ప్రకటించారు. మోడీ సర్కార్‌తో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. ఎన్డీయేలో సభ్యులు కాకున్నా.. ఇంతకాలం కేంద్ర సర్కారుకు మద్దతు పలికిన సీఎంలు కేసీఆర్, జగన్ ఒక్కసారిగా తిరుగుబావుటా ఎగరేశారు. పెట్రో ధరల విషయంలో కేంద్రం తీరును ఎండగడుతూ ఇద్దరు సీఎంలు సంచలన ప్రకటనలు చేశారు.
అయితే ఇన్నాళ్లూ స్నేహం చేసిన బీజేపీతో ఇక యుద్ధమేనని కేసీఆర్, జగన్ సంకేతాలివ్వడం ఉమ్మడి వ్యూహమా అన్నట్లుగా చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకేసారి పెట్రో ధరలపై పోరుకు దిగడం రెండు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీయేతర, కాంగ్రెసేతర జాతీయ కూటమి ఏర్పాటు ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకోనుందా అనే చర్చకు సీఎం కేసీఆర్ మళ్లీ తెరలేపారు.
పెట్రో ధరలకు సంబంధించి పన్నుల వసూలు విధానాలను మోడీ సర్కారు ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలంగా మార్చుకుందని.. పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారని కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. పెట్రోల్ పై వ్యాట్ లో నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు కూడా 41 శాతం వాటా లభిస్తుంది.
కానీ మోడీ సర్కార్ కావాలనే వ్యాట్ కాకుండా అదనపు నిధులు సమకూర్చుకునే సెస్ విధానాన్ని పెట్రోపై అమలు చేస్తోంది. ఇది రాష్ట్రాల కడుపు కొట్టడమేనని కేసీఆర్, జగన్ ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 3 లక్షల 35 వేల కోట్లు వసూలు చేస్తే అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19 వేల 745 కోట్లు మాత్రమేనని అంటే కేవలం 5.8 శాతం మాత్రమే అని జగన్ సర్కారు పేర్కొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహా వాదన వినిపిస్తూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.