విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేయాలని ఇది ఆంధ్రుల హక్కు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారు. పోరాటానికి మద్దతుగా ఈ మధ్య విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో నాటి నినాదాలను మరోసారి గుర్తుచేశారు జనసేనాని. కాగా అప్పటి పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు.. పోలీసు కాల్పుల్లో అమరులైన వారి పేర్లను.. నాటి పోరాటంలో ఆంధ్రప్రభ కథనాలను నేటి తరానికి తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రభ కథనాలను పోస్టు చేశారు పవన్.. కాగా నాటి ఉద్యమం సాగిన తీరు.. పోలీసు కాల్పులు జరిగిన విధానం చదివి తెలుసుకుందాం..
నాటి ఆమరణ నిరాహార దీక్ష.. – పోలీసు కాల్పులు
1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యమం బలపడింది. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిలుచున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దశల వారీగా తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి.
అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, యం.వి.భద్రం, రావిశాస్త్రి తదితరులు ప్రసంగించారు.
1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె.బాబూరావు సహా తొమ్మిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. దీంతో ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చింది.
‘‘ఉద్యమం హింసాత్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం పెద్ద ఎత్తున జరిగింది. కొత్తగా ఏర్పడిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రజాగ్రహానికి ఎక్కువగా గురైనట్లు కనిపించింది. రైల్వే స్టేషన్లు ఎక్కువగా ఆందోళనకారుల లక్ష్యమయ్యాయి. రైల్వేకి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది’’ అని ఎస్.డి.జాత్కర్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏలూరు కాలువలో పడేశారు. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో.. తగరపువలసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, వరంగల్‌లో ఒకరు, సీలేరులో ఒకరు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మొత్తం మీద విశాఖతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు.