Friday, November 22, 2024

Big story : గుట్టుగా.. గ’మ్మత్తు’గా.. ఏపీలో ఒకేరోజు వెలుగు చూసిన మాదక ద్రవ్యాలు

అమరావతి, ఆంధ్రప్రభ : తె లుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌ కల్చర్‌ మరింత ఉూపందుకుంటోంది. తెలంగాణాలో ఇప్పటికే మాదక ద్రవ్యాల వినియోగం తారాస్ధాయికి చేరుకోగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే ఈ కల్చర్‌ బలపడుతోంది. రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా మత్తు కార్యకలాపాలు గుట్టుగా సాగుతున్నాయి. మెల్లగా పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ చాపకింద నీరులా వస్తున్న డ్రగ్స్‌ను అరికట్టడంలో రాష్ట్ర యంత్రాంగం ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. ఇందుకు గతంలో కూడా పలుమార్లు రాష్ట్రంలో డ్రగ్స్‌ పట్టుబడట మే నిదర్శనం. తాజాగా బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో పలు చోట్ల మత్తు మాదక ద్రవ్యాలు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ఉత్తరాంధ్రాలోని విశాఖ కేంద్రంగా 54 గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు కనుగొంటే.. బెజవాడ కేంద్రంగా కృష్ణాజిల్లాలో పాఠశాల విద్యార్ధులు గంజాయి వినియోగించడాన్ని గుర్తించారు. అదేవిధంగా రాయలసీమ కేంద్రంగా భారీగా హాష్‌ ఆయిల్‌ (గంజాయి నుంచి తీసిన నూనె)ను పట్టుకోగా, గుంటూరు కేంద్రంగా వెయ్యి కేజీలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒకే రోజు వెలుగులోకి రావడం రాష్ట్రంలో క్రమేణా పెరుగుతున్న మత్తు, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా కల్చర్‌ను సూచిస్తోంది. గంజాయి, హాష్‌ ఆయిల్‌ను మాఫియా విశాఖ కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తుంటే మరోవైపు డ్రగ్స్‌ మాఫియా పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి మాదక ద్రవ్యాలను చేరవేస్తోందనడంలో సందేహమే లేదు. తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్‌ రేపిన కలకలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లోని రాడిసన్‌ హోటల్‌, ఫుడింగ్స్‌ అండ్‌ ప బ్‌లో కొద్దిరోజుల క్రితం వెలుగు చూసిన డ్రగ్స్‌ సరఫరా, వినియోగం వ్యవహారం ఇంకా మరుగున పడనే లేదు. పబ్‌లో పట్టుబడిన ప్రముఖులు, అదేవిధంగా దొరికిన కొకైన్‌, గంజాయి, ఎల్‌ఎస్‌డీ వంటి మాదక ద్రవ్యాలు అక్కడి డ్రగ్‌ కల్చర్‌ను స్పష్టం చేస్తోంది. దీనికి కొద్దిరోజుల ముందే డ్రగ్స్‌కు ఓ యువకుడు బలి కావడం తెలంగాణాలో తొలి డ్రగ్‌ మరణం కేసుగా నమోదైంది. అతిగా డ్రగ్స్‌, గంజా, హాష్‌ ఆయిల్‌ వినియోగం వల్లే యువకుడు మరణించాడు. అయితే హాష్‌ ఆయిల్‌ సరఫరా కేసులో ప్రధాన సూత్రధారి అయిన లక్ష్మీపతిని నార్కోటిక్‌ వింగ్‌ పోలీసులు ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం గమనార్హం. అంటే గంజాయి, హాష్‌ ఆయిల్‌ ఉత్పత్తికి ఏపీ అడ్డాగా విశాఖ కేంద్రంగా ఉందనడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎంత కాదన్నా.. హైదరాబాద్‌లో వేళ్లూనుకున్న డ్రగ్స్‌ కల్చర్‌ ప్రభావం మెల్లగా ఏపీలో బలపడుతోంది.

విశాఖలో డ్రగ్స్‌ కలకలం.. కొత్తేమీ కాదు..

తాజాగా బుధవారం విశాఖపట్నంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న అక్కడి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ విశాఖకు చేరడం మరింత కలకలం రేపుతోంది. స్పటిక రూపంలో ఎండీఎంఏను 54 గ్రాముల డ్రగ్స్‌ను తీసుకువచ్చి విక్రయించడ ం, వినియోగించడం ఇందుకు కారణమైన విద్యార్ధులను అరెస్టు చేయడం మరింత ఆందోళన కలిగించే అంశం. అయినా ఇది కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు డ్రగ్స్‌ వెలుగు చూసిన సంఘటనలూ లేకపోలేదు. కాకపోతే పట్టుబడిన ప్రతీసారీ మెల్కొనడమే తప్ప ముందస్తుగా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. విశాఖ జిల్లా లోని ఏజెన్సీ నుంచి తెలుగు రాష్ట్రాలకు గంజాయి సరఫరా జరుగుతుందనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఈడ్రగ్స్‌ వ్యవహారం నివ్వెరపరిచింది. ఈ ఏడాది జనవరిలో విశాఖలోని ఎన్‌ఏడి జంక్షన్‌ వద్ద టాస్‌ ్కఫోర్స్‌ పోలీసులు, ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్‌ పట్టుబడింది. హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్య, విశాఖకు చెందిన హేమంత్‌, రాజాంకు చెందిన డాక్టర్‌ ఫృధ్వీ అనే వారిని నిందితులుగా గుర్తించి వీరినుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్‌, రెండు ఎండిఎం పిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గత ఏడాది నవంబర్‌లో బెంగళూరు నుంచి కొకైన్‌ తీసుకువచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. విద్యార్ధులే లక్ష్యంగా డ్రగ్స్‌ చేరవేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఓ రౌడీషీటర్‌ పాత్ర కీలకంగా ఉన్నట్లు విచారణలో తేల్చారు. ఇప్పుడు తాజా సంఘటనలో కూడా చినవాల్తేర్‌లో విద్యార్ధులే ఈ స్పటిక 54 గ్రాముల డ్రగ్స్‌ సరఫరా, వినియోగానికి కారణంగా ప్రాధమిక విచారణలో నిర్ధారించారు.

తిరుపతి జిల్లాలో హాష్‌ ఆయిల్‌ అలజడి…

మరోవైపు రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో పట్టుబడిన హాష్‌ ఆయిల్‌తో ఒక్కసారిగా అలజడి రేగింది. అటు బెంగ ళూరు, ఇటు చెన్నై అంటే జిల్లాకు దగ్గరగా ఉన్న కర్నాటక, తమిళనాడు నుంచి డ్రగ్స్‌ మాఫియా అడుగు పెట్టిందని నిఘా విభాగం అనుమానిస్తోంది. డ్రగ్స్‌తోపాటు గంజాయి, దానినుంచి తీసిన నూనె హాష్‌ ఆయిల్‌ వినియోగంపై పోలీసులు వర్గాలు నివ్వెరపోతున్నాయి. తిరుపతిలోనే కాదు అనంతపురం రేంజ్‌ పరిధిలోనే ఈ తరహా కార్యకలాపాలకు తావే లేదని డిఐజి రవి ప్రకాష్‌ చెబుతున్నప్పటికీ బుధవారం పుత్తూరు సబ్‌ డివిజన్‌ పోలీసులు 1.435 కేజీల లిక్విడ్‌ గంజాయి (హాష్‌ ఆయిల్‌)ను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన స్వయంగా విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. పట్టుబడిన హాష్‌ ఆయిల్‌ రూ.7,17,500 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల్లో అనంతపురానికి చెందిన జనుగుండ మోహన్‌ కృష్ణ, చెన్నైకు చెందిన అజ య్‌కుమార్‌, ప్రకాష్‌లు ఉన్నారు. వీరంతా విశాఖపట్న నుంచి సేకరించిన హాష్‌ ఆయిల్‌ను చెన్నై తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సర ఫరా చేస్తున్న క్రమంలో తిరుపతిలో దొరికిపోయారు. విశేషమేమంటే నిందితుల్లోని మోహన్‌ కృష్ణ గతంలో కానిసే ్టబుల్‌గా పని చేస్తూ గంజాయి స్మగ్లింగ్‌లో అరెస్టయి, సస్పెండ్‌ అయి, జైలుకు వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఇదే వ్యాపారాన్ని షురూ చేశాడు. లిక్విడ్‌ గంజాయిని పుత్తూరులో విక్రయిస్తుండగా పట్టుబడ్డారు.

- Advertisement -

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ..

ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ మత్తు, మాదక ద్రవ్యాల వినియోగం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణాజిల్లాలో కంకిపాడులోని ప్రభుత్వ పాఠశాల, ఓకార్పొరేట్‌ స్కూలు విద్యార్ధులు గంజాయి సేవిస్తున్నట్లు ఉపాధ్యాయులు గుర్తించడం మరింత ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోంది. గంజా మాపియా తమ స్వార్ధం, అక్రమార్జన కోసం విద్యార్ధులను ఆకర్షించి చిన్న చిన్న గంజాయి పొట్లాలు పాఠశాల గొడల వైపు నుంచి లోపలికి వేయడం ఇక్కడ పరిపాటిగా మారిందని గుర్తించిన పాఠశాల వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. కాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా గుంటూరు కేంద్రంగానూ మత్తు, మాదక ద్రవ్యాల వినియోగం కొనసాగుతూనే ఉంది. గతంలో ఇక్కడి ప్రైవేటు కళాశాలల్లో చదివే నైజీరియన్లుతోపాటు మరికొందరు తెలుగు విద్యార్ధులు మత్తు వినియోగంలో ఘర్షణ పడిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా బుధవారం గుంటూరు కొత్తపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో స్ధానిక పోలీసులు సెబ్‌ అధికారులతో కలిసి సమాచారం మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని 4,160 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇత పెద్ద మొత్తంలో గుంటూరు చరిత్రలో గంజా పట్టుబడటం కలకలం రేపుతోంది. సీజ్‌ చేసిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని, విశాఖ ఏజెన్సీ నుంచి తరలించి ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో గుర్తించారు. గతంలో కూడా విజయవాడలోని ఓ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో భారీగా డ్రగ్స్‌ రవాణా అవుతున్నట్లు ఢిలీ ్ల పోలీసులు గుర్తించి పట్టుకునే వరకు విజయవాడ పోలీసులకు కనీసం వాసన కూడా రాకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో విజయవాడకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకుని అభాసుపాలవడం ప్రస్తుతం జనం గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం మీదట రాష్ట్రంలో హైదరాబాద్‌ తరహా డ్రగ్స్‌ కల్చర్‌, మత్తు, మాదక ద్రవ్యాల కార్యకలాపాలు జోరందుకుంటున్నాయనడంలో బుధవారం ఒక్కరోజే వెలుగు చూసిన ఈఘటనలు రుజువుచేస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగ కళ్ళు తెరిచి ముందస్తు చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తు విషమయమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటిని నియంత్రించేందుకు హైదరాబాద్‌ తరహాలో ఏపీలో కూడా నార్కోటిక్‌ ప్రత్యేక విభాగం అవశ్యకతను గుర్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement