Tuesday, October 15, 2024

Big Story: లక్ష కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులు.. ఖజానాకు భారంగా మారిన బిల్లులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఖజానాకు పెండింగ్‌ బిల్లులు భారంగా మారాయి. వివిధ రూపాల్లో సుమారు లక్ష కోట్లకు పైగా పెండింగ్‌ ఉండడంతో అధికారులపై కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. కాంట్రాక్టర్లు చేసిన పనులకే కాకుండా, ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్ధిక ప్రయోజనాల బిల్లులు, నిర్వహణ బిల్లులు వంటివి కూడా భారమవుతున్నాయి. తాజా అంచనా మేరకు రూ.1.30 లక్షల కోట్లవరకు పలు రకాల బిల్లులు, చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఆర్ధికశాఖ ఈ విషయాన్ని అంగీకరిస్తున్న బయటకు మాత్రం ఎప్పటికప్పుడు చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామనే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా పలు వర్గాలకు నగదు చెల్లింపులు నిలిచిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2019 మార్చి 31 నాటికి భారీగా బిల్లులు పెరడింగ్‌ జాబితాలోకి చేరిపోయాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ బిల్లులు భారంగా మారిపోగా, ఆ తరువాత మరిన్ని బిల్లులు ఈ జాబితాలోకి చేరిపోయాయి. అందులో అత్యంత కీలకమైన ‘పనుల బిల్లులు’ ఉండడం వల్ల అభివృద్ధి మందగించినట్లు సమాచారం.

ప్రాజెక్టులు, పంచాయితీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి వంటి శాఖల ద్వారా చేస్తున్న నిర్మాణ పనులకు కూడా నిధులు అందకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనేక పనులు కూడా ఎక్కడివక్కడ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్ధిక ప్రయోజనాలు కూడా చాలాకాలంగా అందడం లేదు. జిపిఎఫ్‌ రుణాలు, జీతాల ఏరియర్స్‌, కొంతమంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు భత్యాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక పలు ప్రభుత్వ శాఖల నిర్వహణకు కూడా భారీగానే బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం బకాయిలు రూ.1.30 లక్షల కోట్ల వరకు ఉంటాయని ఒక అంచనా. ఆర్థికశాఖ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ ఇవే అంశాలు చర్చకు వస్తున్నాయని, త్వరగా బకాయిలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు తప్ప అమలు మాత్రం కనిపించడం లేదని కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ఇతర శాఖల అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుల కోసం తరచూ ఆర్థికశాఖ వద్దకు వెళ్తున్నప్పటికీ, ఫలితం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement