Thursday, November 21, 2024

Big Story: ఓటీఎస్‌కు ఎవరూ మందుకురావట్లే.. పట్టణాల్లోనూ రెస్పాన్స్ లేదు..

చిత్తూరు కలెక్టరేట్, (ప్రభ న్యూస్) జగనన్న సంపూర్ణ గృహ హక్కు తమకొద్దని.. ఆ పథకం కింద లబ్ధిపొందిన వారు తెగేసి చెప్తున్నారు. వన్‌ టై సెటిల్మెంట్‌ అంటూ వారి వద్దకు వెళ్లిన అధికారులు, వలంటీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మేము ఇల్లు కట్టుకొని చాలా ఏళ్లు అవుతోంది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన కొంత సొమ్ముకు మరికొంత కలుపుకుని నిర్మించుకున్నాం. ఇప్పుడు మీరొచ్చి వేల రూపాయలు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలి. అసలే తిండికి కూడా గడవక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి వేల రూపాయలు అప్పులు తెచ్చి చెల్లించాలా? మీరిచ్చే హక్కులు మాకొద్దు! ఎంతో కాలంగా ఈ ఇంటిలోనే ఉంటున్నాం. మాకు ఏ ఇబ్బందీ లేదు. డబ్బులు కట్టడం మా వల్లకాదు’’ అని స్పష్టం చేస్తున్నారు. 

40 ఏళ్ల నుంచి గృహ నిర్మాణ పథకం అమలు

ఉమ్మడి రాష్ట్రంలో  1983 నుంచి గృహ నిర్మాణ పథకం అమలవుతోంది. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పేదలు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. 2014 మార్చి వరకు ప్రభుత్వాలు కొంత సబ్సిడీతో గృహాలు నిర్మించుకునేందుకు రుణాలు అందజేశాయి. అయితే గూడు కట్టుకున్నది పేదలే కాబట్టి ఇచ్చిన రుణాలను ఏ ప్రభుత్వమూ తిరిగి కట్టించుకోలేదు. పైగా లబ్ధిదారులను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని అడిగిన వారు ఇప్పటి వరకూ లేరు. దీంతో పక్కా గృహాలు పొందిన వారు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం ఉచితమే అని ఇంతకాలం అనుకున్నారు. 

పాత రుణాల వసూలుకు ప్రభుత్వం ఎత్తుగడ

పాత రుణాలను రాబట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం  సరికొత్త ఎత్తుగడ వేసింది. సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో వసూళ్లకు సిద్ధమైంది. డబ్బులు చెల్లించాలని లబ్ధిదారులపై అటు వలంటీర్లు, ఇటు సచివాలయ సిబ్బంది ఒత్తిడి పెంచుతున్నారు. పట్టణాలు, నగరాల్లో అక్కడక్కడా కొందరు ముందుకు వస్తున్నప్పటికీ మండలాల్లో మాత్రం స్పందన కనిపించకపోగా తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది.

- Advertisement -

వన్‌టైం సెటిల్‌మెంటు ఇలా..

ప్రస్తుతం ప్రభుత్వం వన్‌ టైం సెటిల్‌మెంటు (ఓటీఎస్‌) ద్వారా జిల్లా నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేయాలని భావిస్తోంది. దీని వలన ఒక్కో కుటుంబంపై రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు భారం పడనుంది. జిల్లాలో 90 శాతం మంది పక్కా గృహాలు పొందిన వారు తిరిగి రుణాలను ప్రభుత్వానికి చెల్లించలేదు. ప్రస్తుతం వన్‌టైం సెటిల్‌మెంటు ద్వారా సెటిల్‌ చేసుకుంటే రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ వన్‌ టైం సెటిల్‌మెంటు కింద లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని గ్రామీణ, పట్టణ, కార్పొరేషన్‌ పరిధిలో ఒక్కో విధంగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు అయితే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.20 వేలు ఓటీఎస్‌ కింద చెల్లిస్తే సరిపోతోంది. ఒక వేళ లబ్ధిదారుడు ఆ ఇంటిని ఇతరులకు అమ్మేసి ఆ ఇంట్లో కొనుగోలుదారుడు నివాసం ఉంటుంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.30 వేలు, నగరాల్లో రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది.  ఇలా ఓటీఎస్‌ ద్వారా డబ్బు చెల్లిస్తేనే వారికి రిజిస్ట్రేషన్‌ చేసి హక్కు పత్రాలను అందజేస్తారు.

మా కొద్దీ పథకం..

జిల్లాలో గత 40 ఏళ్లలో 4.71 లక్షల మంది ప్రభుత్వం అందించే రుణంతో పక్కా గృహాలు నిర్మించుకున్నట్లు గృహ నిర్మాణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరి నుంచి తిరిగి రుణాలను రాబట్టాల్సి ఉంది. అందులో అనేక మంది ఇళ్లను అమ్మేసుకున్నారు. వాటిలో కొనుగోలుదారులు ఉంటున్నారు. వీరి నుంచి కూడా వన్‌టైం సెటిల్‌మెంటు కింద డబ్బులు కట్టించుకుని స్థలం నివాసం ఉంటున్న వారి పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలనుకున్న ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఎవరైతే అసలు లబ్ధిదారుడు ఉన్నారో వారి నుంచి ఓటీఎస్‌ కింద డబ్బులు కట్టించుకుని రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ అధికారులు లబ్ధిదారులకు ఇళ్లకు 30 ఏళ్ల నుంచి నిర్మించుకున్న పక్కా గృహాలు అనేక చోట్ల నివాసానికి పనికి రాకుండా ఉన్నాయి.

వలంటీర్లు, సచివాలయం సిబ్బందిపై ఒత్తిడి

వన్‌టైం సెటిల్‌మెంటుకు సంబంధించి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం టార్గెట్లు నిర్ణయించింది. లబ్ధిదారుల నుంచి నగదు కట్టించాలంటూ ఒత్తిడి పెంచింది. గ్రామాల్లో ఉన్నతాధికారులు పర్యటిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓటీఎస్‌ కింద పది శాతం మంది కూడా నగదు చెల్లించేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో సచివాలయంలోని కార్యదర్శి, సంక్షేమ కార్యదర్శి,  ఇతర ఉద్యోగులకు ఆయా గ్రామాల్లో ఉన్న లబ్ధిదారులను కలిసే బాధ్యత అప్పగించి వారితో డబ్బులు కట్టించాల్సిందేనంటూ ప్రభుత్వం చెబుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement