Friday, November 22, 2024

Big Story: ఉపాధిని దెబ్బతీస్తున్న ధరల పెంపు.. అన్ని రంగాలపై ‘పెట్రో’ ఎఫెక్ట్‌

(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) : పెట్రోల్‌, డీజెల్‌ ధరల పెరుగుదల దేశంలోని అన్నిరంగాల‌ను ప్రభావితం చేస్తోంది. పెద్దసంఖ్యలో ఉపాధి అవ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తోంది. ప్రత్యక్షంగా రవాణా రంగంపై ఇది పెనుభారం మోపుతోంది. పరోక్షంగా పలు రంగాలు దీని ప్రభావంతో కునారిల్లుత్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని వేగం తో పెట్రోల్‌, డీజెల్‌ ధరలు దూసుకుపోతున్నాయి. మూడేళ్ళలో పెట్రోల్‌ డీజెల్‌, ధరల పెరుగుదల భారం సాధారణ ద్విచక్ర మోటార్‌సైకిల్‌ వినియోగదారుడిపై ఏడాదికి అదనంగా 9వేలుగా నమోదౌతోంది.

ఇలా ఉంటే దేశవ్యాప్తంగా సుమారు ఆరుకోట్ల మంది మత్స్యకారులు ఇప్పుడు ఉపాధి కోల్పోయారు. ఇందుక్కారణం తీరం వెంబడి చేపట్టే చేపల వేట వ్యయం అనూహ్యంగా పెరిగింది. దేశంలో 1.45కోట్ల మత్స్యకార కుటుంబాలు పూర్తిగా సముద్రంపై చేపలవేట ద్వారానే ఉపాధి పొందుతున్నాయి. మరో 85 లక్షల మత్స్యకార కుటుంబాలు ఇతర రంగాల్లో వేళ్ళూనుకున్నాయి. భారత్‌కు 7,516 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరముంది. దీని వెంబడి 3,827మత్స్యకార గ్రామాలున్నాయి. 1914 సంప్రదాయ వేట కేంద్రాలున్నాయి. ఈ గ్రామాలన్నీ సముద్రానికి అత్యంత చేరువలోనే ఉన్నాయి. ఈ గ్రామాల్లోని మత్స్యకారులు సముద్రాన్నే నమ్ముకుంటారు. ఒకప్పుడు సాధారణ తెప్పలు, పడవలపై చేపల వేట సాగేది.

కానీ, పెరిగిన జలకాలుష్యం కారణంగా కనీసం వందకిలోమీటర్ల లోనికెళ్తే తప్ప సముద్ర సంపద లభించడం లేదు. అంత లోపలికి సాధారణ తెప్పలు, తెరచాప పడవలు ప్రయాణించలేవు. క‌చ్చితంగా ఇంజన్‌పై నడిచే మరపడవపైనే వేటసాగించాలి. ఈ పడవల్లో వినియోగించే డీజెల్‌పై లీటర్‌కు ఆరు నుంచి 9.80 రూపాయల వరకు కొన్ని రాష్ట్రాలు సబ్సిడీనిస్తున్నాయి. అంతకుమించి మత్స్యకారులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు సమకూరడం లేదు. కేవలం సముద్ర సంపద పునరుత్పత్తి సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపల వేట నిషేధంలో కోల్పోయిన ఉపాధికి అనుగుణంగా కొన్ని రాష్ట్రాలు మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.

ఇప్పుడు దేశవ్యాప్తంగా మత్స్యకారులు చేపల వేట నిర్వహించలేకపో తున్నారు. ఇందుక్కారణం పెరిగిన డీజెల్‌ ధరలే. గత రెండేళ్ళలో డీజెల్‌ ధర 42 శాతానికి పైగా పెరిగింది. అలాగని డీజెల్‌పై ఇచ్చే సబ్సిడీ ఏమాత్రం పెరగలేదు. దీంతో వందల లీటర్ల వ్యయాన్ని భరించి చేపల వేట సాగించాల్సి వస్తోంది. ఇందుకు తగ్గట్లుగా సముద్ర మత్స్య సంపద ధర పెరగలేదు. దీంతో వేట సమయంలో సమృద్ధిగా చేపలు లేదా రొయ్యలు లభించినా అందుకయ్యే ప్రయాణ ఖర్చుతో పోలిస్తే నష్టమొస్తోంది.

ఈ కారణంగా ఇప్పుడు లక్షలాదిమంది మత్స్యకారులు ఇళ్ళకే పరిమితమయ్యారు. సాధారణంగా మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, పురుషులు కూడా సముద్ర సంపదనే నమ్ముకుంటారు. పురుషులు వేటకెళ్ళి చేపలు తెస్తే మహిళలు వాటిని మార్కెట్లో అమ్ముకొస్తుంటారు. ఇప్పుడు కుటుంబంలో ఎవరికీ పనిలేదు. దీంతో అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ బియ్యం తిని బ్రతుకులీడుస్తున్నారు. మత్స్యకార గ్రామాలన్నీ ఇప్పుడు నిస్సత్తువతో అలమటిస్తున్నాయి. ఆకలి రాజ్యాలుగా మారిపోయాయి.

- Advertisement -

ఆటోవాలా.. విలవిల
అలాగే దేశంలో 1.20 కోట్ల ఆటోలున్నాయి. వీటిపై సుమారు ఐదుకోట్ల మంది జీవిస్తున్నారు. ఈ ఆటోలన్నీ ఇప్పుడు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు స్వయం ఉపాధి పథకాల్లో ఆటో అగ్రగామిగా ఉండేది. లబ్ధిదారుడు ఆటో నడుపుతూ రోజూ కనీసం ఐదారొందలు ఇంటికి తీసుకెళ్ళేవాడు. దీంతో కుటుంబమంతా హాయిగా బ్ర తకగలిగేది. ఇప్పుడు ఆటోలకు వినియోగించే పెట్రోల్‌, డీజెల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

అలాగని రవాణా చార్జీల పెంపునకు అవకాశం కొరవడింది. అవసరానికి మించి ఆటోలున్నాయి. దీంతో అనూహ్యమైన పోటీ నెలకొంది. ఈ దశలో చార్జీలు పెంచితే ప్రయాణీకుల ఆధరణ లభించదు. డీజెల్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదల పేరిట అదనపు భారాన్ని మోసేందుకు ప్రయాణీకులు సంసిద్ధంగా లేరు. ఇది ఆటో నిర్వాహకులు, డ్రైవర్ల భవిష్యత్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు రోజంతా ఆటో నడిపినా పెరిగిన డీజెల్‌ ధర కారణంగా చేతికి 50రూపాయలు కూడా మిగలడం లేదు.

కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటోవాలాలు నడపడంకంటే బండి మూలనపెట్టి మరో ఉపాధి అవకాశంవైపు దృష్టి సారిస్తున్నారు. గతేడాది చివరి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల ఆటోల్లో సగానిపైగా ఇళ్ళకే పరిమితమయ్యాయి. రోడ్డెక్కేందుకు సాహసించడంలేదు.

10కోట్ల మంది ఉపాధిపై దెబ్బ
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల పాపాన్ని కేంద్రం, రాష్ట్రాలు ఒకరిపైఒకరు నెట్టేసుకుంటు న్నాయి. వినియోగదార్ల కొనుగోలు శక్తిమించి ఈ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు కేంద్రం విధించిన సుంకాలే కారణమని రాష్ట్రాలు వాదిస్తున్నా యి. జీఎస్‌టీ పరిథిలోకి పెట్రో ఉత్పత్తుల్ని తెచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించకుండా ఎక్కువ మోతాదులో పన్నులు వసూలు చేస్తున్నాయంటూ కేంద్రం నిందిస్తోంది.

ఇలా పరస్పర ఆరోపణలతో కేంద్రం, రాష్ట్రాలు కూడా ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. సాధారణంగా వీటి ధర పెరుగుదల పరిశ్రమలు, రవాణా రంగాలపై పరిమితమని భావిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పలు కుటుంబాల జీవన భద్రతపై వీటి ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పదికోట్ల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement