Tuesday, November 26, 2024

Big Story: సొంత వైద్యంతో అనర్థాలు.. కౌంటర్‌ మెడిసిన్‌ ఇంకా డేంజర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జలుబు, ద‌గ్గు, చిన్నపాటి జ్వరమే కదా.. మెడికల్‌ షాప్‌కు వెళ్లి ఓ ట్యాబ్‌లెట్‌ కొనుక్కుని వేసుకుంటే స‌రిపోద్ది.. లేదంటే ఓ సిరప్‌ కొనుక్కుని తాగితే తగ్గిపోతుందనుకోవడం అంత మంచిదికాదంటున్నారు డాక్ట‌ర్లు. అట్లా చేయ‌డం కూడా మానుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలకు డాక్టర్‌ను సంప్రదించకుండానే నేరుగా మెడికల్‌ షాప్‌కు వెళ్లి కౌంటర్‌ ఆర్డర్‌తో మందులు కొని వేసుకోవడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఓ వైపు కరోనా … మరోవైపు వర్షాకాలంలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా తదితర సీజనల్‌ జ్వరాలు.

ఈ పరిస్థితుల్లో చిన్నారులు మొదలు పెద్దల వరకు ప్రతీ ఒక్కరికీ జలుబు, దగ్గు, జ్వరం కామన్‌ అయిపోయాయి. దీంతో దగ్గర్లోని మందుల షాపుకు వెళ్లి చాలా మంది మాత్రలు, సిరప్‌లు వేసుకుంటున్నారు. ఓవర్‌ కౌంటర్‌ మెడికల్‌ సేల్స్‌ చాలా మందిలో ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా దగ్గు టానిక్‌ (కాఫ్‌ సిరప్‌), పారాసెటమాల్‌ ట్యాబ్‌లెట్లు, ఇతర యాంటిబయోటిక్‌ మాత్రల వినియోగం ఇష్టానుసారంచేస్తే ఐసీయూలో చేరాల్సిన పరిస్థితులు రావొచ్చని, ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలి కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కౌంటర్‌ మెడికల్‌ సేల్స్‌ పెరిగిపోయాయి. జ్వరం, జలుబు, దగ్గు వస్తే చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లడం లేదు. కనీసం చిన్నారులకు ఈ అనారోగ్య లక్షణాలు ఉన్నా వైద్యుడికి చూపించడం లేదు. మెడికల్‌ షాప్‌కు వెళ్లి షాప్‌లో ఇచ్చిన కాఫ్‌ మందులు, పారాసిటమాల్‌ సిరప్‌లను చిన్నారులకు వాడుతున్నారు. దీంతో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమిస్తున్న సందర్భాలు కోకొల్లలుగా నమోదవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యం ప్రారంభంలో కౌంటర్‌ మెడిసన్స్‌ తో చాలా మంది చిన్నారుల ఆరోగ్యం విషమిస్తోంది. ఎమర్జెన్సీ వార్డుల్లో ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్నారుల కోసం వినియోగించే కాఫ్‌, పారాసిటమాల్‌, యాంటిబయోటెక్‌ సిరప్‌లతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డాక్ట‌ర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడికల్‌ షాప్‌లో కొనుక్కొచ్చిన కాఫ్‌ సిరప్‌ పట్టించాక చాలా మంది చిన్నారులు పాలు తాగిన వెంటనే వాంతులు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో చిన్నారులకు ప్రత్యేకమైన వైద్య చికిత్స అవసరమవుతోంది. కాఫ్‌ సిరప్‌ పట్టించిన చిన్నారులు ఆడుకుంటూ కండ్లు తిరిగి పడిపోవడం పరిపాటిగా మారుతోంది. దగ్గు టానిక్‌లలో ఉండే డెక్సో మెథ్రోపాన్‌ అనే పదార్థంతో మత్తుతోపాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో చిన్నారుల విషయంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇష్టానుసారంగా కౌంటర్‌ మెడిసన్స్‌ వాడితే చిన్నారుల్లో క్రమంగా యాంటిబయోటెక్‌ ఔషధాలు పనిచేయకుండా పోయే ప్రమాదముందని, ఇదే జరిగితే భవిష్యత్‌లో వారు అనేక ఇబ్బందులు ఎర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు కాలేయ వైఫల్యం, కోమాలోకి వెళ్లిపోవడం, అప్పడప్పుడూ ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడం, వాంతులు కావడం జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement