Tuesday, November 19, 2024

BIG Story – పెండింగ్‌ ఫైళ్ల లెక్క తేల్చండి! – దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ: దేవాదాయశాఖలో పెండింగ్‌ ఫైళ్లకు తొందరలోనే మోక్షం కలగనుంది. విభాగాల వారీగా పెండింగ్‌ ఫైళ్లపై కమిషనర్‌ శ్రీరాము సత్యనారాయణ ప్రత్యేక దృష్టిసారించారు. ఏయే విభాగాల్లో ఎన్నెన్ని ఫెండింగ్‌ ఫైళ్లు ఉన్నాయనే దానిపై అధికారుల వివరణ కోరినట్లు తెలిసింది. అర్చకుల సంక్షేమం, ఇంజనీరింగ్‌, ఆలయాల అభివృద్ధి, థార్మిక పరిషత్‌, కోర్టులో పెండింగ్‌ కేసులు, పరిపాలనా విభాగం సహా..అన్ని విభాగాల్లో పెండింగ్‌ ఫైళ్ల వివరాలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. శాఖల వారీగా పరిష్కరించిన ఫైళ్లు, పెండింగ్‌ ఫైళ్లు, అందుకు కారణాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఫెండింగ్‌ ఫైళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. తొందరలోనే శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అన్ని ఫైళ్లను సిద్ధం చేయాలని పేర్కొంది. ఇదే క్రమంలో విభాగాల వారీ పెండింగ్‌ ఫైళ్లపై కమిషనర్‌ ఆరా తీస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు..
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున పెండింగ్‌ ఫైళ్లు పేరకుపోవడంపై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టిసారించింది. వివిధ శాఖల్లో ఫైళ్ల పెండింగ్‌ వలన ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభుత్వం శాఖల వారీగా పెండింగ్‌ ఫైళ్ల వివరాలను కోరింది. ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో దేవదాయశాఖ కూడా విభాగాల వారీగా పెండింగ్‌ ఫైళ్ల జాబితాను సిద్ధం చేస్తోంది. గతంలోనే ఫైళ్ల పెండింగ్‌పై కమిషనర్‌ సత్యనారాయణ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అధికారుల సమావేశాలు నిర్వహించి ఫైళ్ల పెండింగ్‌పై చర్చిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఫైళ్లను పెండింగ్‌ లో పెడితే కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో మరోసారి అన్ని ఫైళ్లకు సంబంధించిన జాబితాను సిద్ధం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్‌ ఆదేశాల నేపధ్యంలో అధికారులు విభాగాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు.

సంక్షేమంపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలోని అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా అర్చకుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకులకు వేతనాలు పెంచడం, చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం(డీడీఎన్‌ఎస్‌) కింద ఆర్థిక సాయం అందించడం చేస్తున్నారు. డీడీఎన్‌ఎస్‌ పథకంలో ఆరు వేలకు పైగా ఆలయాలకు నెల నెలా ఆర్థిక సాయం అందుతోంది. గతంలో అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్న అర్చకులకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచారు. మరో అడుగు ముందుకేసి ఆలయాల నిర్వహణ బాధ్యతలను కూడా అర్చకులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరో వైపు రాష్ట్రంలోని ఆలయాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ సహకారంతో కొన్ని ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టగా, సీజీఎఫ్‌ నిధులతో మరికొన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. సీజీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ కట్టిన ఆలయాలకు ఇప్పటికే నిధులు మంజూరు చేశారు. అనేక ఆలయాల అభివృద్ధి పురోగతిలో ఉంది. ఉద్యోగుల సంక్షేమం, థార్మిక పరిషత్‌ నిర్వహణ సహా వివిధ అంశాల పరిష్కారంపై కమిషనర్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆయా పనుల పురోగతిపై తాజాగా నివేదిక సిద్ధం చేస్తున్నారు.

12న సమీక్షా సమావేశం..
రాష్ట్ర దేలాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నెల 12న దేవాదాయశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని వివరాలను సిద్ధం చేయాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేయడంతో సమీక్షా సమావేశంలో పెండింగ్‌ ఫైళ్లపై చర్చించనున్నారు. ఫైళ్ల పెండింగ్‌ కారణాలను తెలుసుకొని పరిష్కార మార్గాలు సమీక్షా సమావేశంలో తీసుకోనున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల పదోన్నతులు, న్యాయపరమైన అంశాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement