Wednesday, November 20, 2024

Big Story: ఆరోగ్యశ్రీలో అక్రమాలకు చెక్‌.. రోగి బ్యాంక్‌ ఖాతా నుంచే నగదు చెల్లింపులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆరోగ్యశ్రీ లో అక్రమాలకు చె క్‌ పెట్టి మరింత పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఆరోగ్యశ్రీ కింద అందించే డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి జమ చేయనున్నారు. అదే ఖాతా నుంచి వైద్యం అందించిన ఆస్పత్రికి నేరుగా చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి అంగీకార పత్రాన్ని పేషెంట్‌నుంచి తీసుకోనున్నారు. రోగికి చేసిన వైద్యం, ప్రభుత్వం నుంచి అందిన సహాయం, అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు అంతా కూడా పారదర్శకంగా ఉండేలా మార్పులు చేస్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల మరింత జవాబుదారీతనం, పారదర్శకత వస్తాయన్నది ప్రభుత్వ అభిప్రాయం. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూంన్త తర్వాత ధృవీకరణ పత్రం తీసుకోనున్నారు. ధృవీకరణ పత్రంలో వైద్యంకోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు. రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు పొందుపర్చనున్నారు. రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా? పూర్తి ఉచితంగా వైద్యం అందిందా? అన్న విషయాలను కూడా ధృవీకరించే పత్రాన్ని రూపొందించనున్నారు. ఎవరైనా లంచం లేదా అదనపు వసూళ్ళు చేసిన నేపథ్యంలో ధృవీకరణ పత్రంలో ఫిర్యాదులకోసం ఏసీబీకి కేటాయించిన టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 లేదా 104 పొందుపర్చనున్నారు. రోగి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిమీద విచారణ చేయాలి. మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలి. రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారు.

ఆగస్ట్‌ 1 నుంచి మరింత పెంపు..

ప్రొసీజర్స్‌ సంఖ్యను మరింత పెంపుదల చేసి ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే అధికారులు ఖరారు చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 1059 ప్రొసీజర్స్‌కు మాత్రమే చికిత్స అందిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి 2,446 రోగాలకు 1,973 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి చోట్ల ఏకంగా 200 ఆస్పత్రుల ద్వారా సేవలు అందజేస్తున్నారు. వెయ్యి రూపాయలు దాటే ప్రతి వైద్యం ఆరోగ్యశ్రీ కిందనే అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాదికి రూ.2,500 కోట్ల మేర ఆరోగ్య శ్రీ పథకానికి బడ్జెట్‌ను కేటాయించింది. ఆరోగ్య శ్రీ పథకానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 1,519 రకాల రోగాలకు చికిత్స పొందిన రోగులకు వారి ఆరోగ్యం కుదుట పడేవరకు రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ.5వేలు ఆర్థిక సాయం అందజేస్తోంది.

బలోపేతం..

ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్‌చేసే విధానాన్ని బలోపేతం చేయనున్నారు. రిఫరల్‌ విధానాన్ని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. విలేజ్‌ క్లినిక్స్‌లో రిఫరల్‌ కోసం పర్మినెంట్‌ ప్లేస్‌ను డిజైన్‌ చేయనున్నారు. ఎక్కడికి రిఫరల్‌ చేయాలన్నదానిపై హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఆరోగ్యశ్రీ అందుకున్న లబ్ధిదారుల నుంచి పథకం ద్వారా తనకు అందిన లబ్ధి వివరాలను లేఖ రూపంలో తీసుకోనున్నారు. ఆరోగ్యశ్రీలో ఆస్పత్రి నుంచి పేషెంట్‌ బయటకు వెళ్తున్నప్పుడు తనకు అందిన వైద్య సేవలపై కచ్చితంగా కన్ఫర్మేషన్‌ తీసుకొనే నిబంధనను అమలు చేయనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement