అమరావతి – వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో టిడిపి,జనసేన నేతలపై ఆయన పోస్ట్ లు పెట్టడంపై ఎపిలో వివిధ పోలీస్ స్టేషన్ లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.. దీనిపై ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మొత్తం మూడు కేసులు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పుడు పిలిస్తే అప్పడు పోలీసుల విచారణకు హాజరుకావాలని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని కండిషన్ విధించింది కోర్టు.
ఇది ఇలా ఉంటే 2022 సంవత్సరంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా టీడీపీ, జనసేన అధినేతలతో పాటు నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్జీవీ ని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణకు గైర్హాజరైన ఆర్జీవి తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.