దర్శి (ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చీటీల పేరుతో ఓ ఉపాధ్యాయుడు మోసం చేశాడు. దర్శి అద్దంకి రోడ్ లో నివాసం ఉంటున్న రామ్ నాయక్ ఉపాధ్యాయుడు. కొన్ని సంవత్సరాలుగా చీటీ పాటలు నిర్వహిస్తూ రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో బాధితులు అనుమానంతో అతని నివాసం వద్దకు వెళ్లగా తాళంవేసి ఉంది. గమనించిన బాధితుడు మోసపోయానని తెలిసి దర్శి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముండ్లమూరు మండలం పులిపాడుతండా గ్రామానికి చెందిన డి.రామ నాయక్ అదే గ్రామాంలో హెడ్మాస్టర్ గా పనిచేస్తూ దర్శిలో నివాసం ఉంటున్నాడు.
పలువురి వద్ద చీటీ పాటలు కట్టయించుకుంటూ దాదాపు 10కోట్ల దాకా జమ చేశాడు. చీటీ పాటలు కట్టిన వారి డబ్బుతో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్టు బాధితులు తెలిపారు. రామ్ నాయక్ రెండు నెలలు స్కూలుకి సెలవు పెట్టి ఎటో వెళ్లాడని, ఫోన్ స్విచాఫ్ చేయడంతో అతనిపై అనుమానంతో పోలీస్ స్టేషన్ కు బాధితులు క్యూ కడుతున్నారని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని ఎస్ఐ తెలిపారు.