Sunday, November 17, 2024

Big Fight – గుడివాడలో టీడీపీ, వైసీపీ హోరాహోరీ


ఎన్నో గుడులకు అలవాలం ప్రాచీన గుళ్లవాడే… నేడు ఏపీ రాజకీయాల్లో కీలక చరిత్ర సృష్టించిన రాజకీయ వాడ.. అదే గుడివాడ ఈ సారి పొలిటికల్ హీట్ కు వేదికగా మారింది. ఎన్టీఆర్ వ్యవస్థాపిత తెలుగుదేశం పార్టీకోటను ధ్వంసం చేయటమే కాదు.. వైసీపీకి తిరుగులేనికంచుకోటగా మలచిన కొడాలి నానిని ఎదురొడ్డి పోరాడటమే ధ్యేయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదో సారి అప్రతిహాత విజయం కోసం కొడాలి నాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. ఈ సారి ఎట్టి పరిస్థితిలోనూ కొడాలి నానిని ఓడించాలని టీడీపీ పకడ్బంధీ పథకాన్ని రచిస్తోంది. గుడివాడ రాజకీయం కేవలం కృష్ణాజిల్లాకే కాదు.. ఉభయ రాష్ర్టాలు ఏపీ, తెలంగాణలోని రాజకీయ పరిశీలకులు ఉత్కంఠ భరిత విశ్లేషణల్లో నిమగ్నమ్యారంటే అతిశయోక్తి కాదు.

(ప్రభన్యూస్ బ్యూరో-కృష్ణా) రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తొలిసారి ఎమ్మెల్యేగా గుడివాడ నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన ముందు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. టీడీపీ ఆవిర్భావం అనంతరం ఈ నియోజకవర్గ కంచుకోట లాంటిది. అటువంటి కంచుకోటలోవైసీపీ పాగా వేసింది. గత పదేళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు గుడివాడ కేంద్ర బిందువుగా మారింది. గుడివాడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి వరుసగా రెండుసార్లు మించి ఎవ్వరూ గెలవలేదు. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు( నాని) నాలుగు సార్లు వరుసగా విజయం సాధించి నియోజకవర్గంలో తన పట్టును పదిలపరుచుకున్నారు.మొదట తెలుగుదేశం అధినేత దివంగత నందమూరి తారక రామారావు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత కూడా టీడీపీ నుంచే పలువురు విజయం సాధించారు.

ఆదిలో రావి కుటుంబానిదే ఆధిపత్యం

ఇక గుడివాడలో ప్రముఖ వాణిజ్య రావి కుటుంబం 2000 వరకూ గుడివాడ రాజకీయ చరిత్రంలో చక్రం తిప్పారు. మధ్యలో యాదవ నేత కటారి ఈశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు సృష్టించినా.. ఆ చరిత్ర కొనసాగలేదు. 1985 లో జరిగిన ఉప ఎన్నికల్లో 1994 ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి, 1999 ఎన్నికల్లో రావి హరగోపాల్, 2000 లో జరిగిన ఉప ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. 1989 లో జరిగిన ఎన్నికల్లో కటారి ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2004 నుంచి గుడివాడ రాజకీయాల్లో కొడాలి నాని పునాది పడింది. పటిష్టమైంది. ఆయనను నియోజకవర్గంలో ఎదుర్కొనే స్థానిక నాయకుడే లేరంటే.. అతిశయోక్తి కాదు.

ఇదీ కొడాలి నాని జమానా..
ముఖ్యంగా 2004, 2009 లోటీడీపీ అభ్యర్థిగా గెలిచిన కొడాలి నాని.. రాష్ట రాజకీయాల్లోని పెనుఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. 2014, 2019 లలో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచే కొడాలి నాని బరిలో దిగుతారని చెబుతున్నారు.వైసీపీ నుంచి పోటీ చేసి ఐదోవసారి గుడివాడ పై తన పట్టును నిలబెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నారు. గుడివాడ క్షేత్ర స్థాయిలో పేరు పేరునా కార్యకర్తల్ని పలకరించటమే కాదు.. ప్రతి ఒడుదుడుకుల్లోనూ కార్యకర్తలకు కొడాలి నాని అండగా నిలవటం ఆనవాయితీ. అందుకే నాని చెప్పిందే వేదం. నాని అడుగులోనే కార్యకర్తల అడుగు. అందుకే తిరుగులేని నేతగా నాని నిలబడిపోయారు.

కొడాలి నానినే బాబు టార్గెట్
20 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రి గా పనిచేసిన కొడాలి నానిని ఓడించాలని దృఢ సంకల్పంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే… కొడాలికి మంత్రి పదవి కూడా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కొడాలి నాని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వైసీపీలో ప్రధానంగా కొడాలి నాని ఇప్పుడు టీడీపీకి టార్గెట్ అయ్యారు. దీంతో గుడివాడలో పార్టీని బలోపేతం చేసుకోవటం, అదే సమయంలో గుడివాడ కేంద్రంగానే కొడాలి నానికి సమాధానం చెప్పే లక్ష్యంతోనే టీడీపీ పావులు కదుపుతోంది. 2004 నుంచి మాత్రం… గుడివాడ.. కొడాలి అడ్డా… అనేలా మారిపోయింది. వరుసగా నాలుగు సార్లు గెలిచి, ఐదోసారి కూడా గెలిచి తన సత్తా చాటుకోవాలని కొడాలి నాని భావిస్తున్నారు.

- Advertisement -

కొడాలికి చెక్ టీడీపీ వ్యూహం
కొడాలి నానికి చెక్ పెట్టేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేసిన టీడీపీ చివరకు ఎన్నారై వెనిగండ్ల రాముని గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జిగాటీడీపీ నియమించింది. ఇక టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు..విభేదాలు పార్టీకి సమస్యగా మారే అవకాశం ఉందని అధిష్టానం గుర్తించింది. పార్టీ అధినేత నియమించిన త్రిసభ్య కమిటీ గుడివాడ నేతలను సమావేశపరిచి,చర్చలు జరిపింది. ఇప్పటివరకు ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టాన దూతలు హామీ ఇచ్చారు. గుడివాడ పార్టీ అధినేతకు ప్రతిష్టాత్మకమైందని, నేతలు అందరూ నియోజకవర్గ నేతలందరూ ఐక్యంగా కలిసి పనిచేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించాల్సిన అనివార్య స్థితిని వివరించారు. దాంతో రావి వర్గం సంతృప్తి చెంది వెనిగండ్ల రాము విజయం కోసం పని చేస్తామని చెప్పి, ఆ దిశగా పార్టీ కార్యక్రమాల్లో ఏకతాటిపై ముందుకు వెళ్తున్నారు. దీంతో గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement