Friday, November 22, 2024

Big Fight – త్రికూట‌ వ్యూహం! ప‌వ‌న్ కోసం వ‌ర్మ సార‌థ్యం

పిఠాపురంలో పొలిటిక‌ల్ హీట్‌
యుద్ధానికి సిద్ధ‌మంటున్న జ‌న‌సేనాని
ప‌వ‌న్ ఓట‌మే ధ్యేయంగా వైసీపీ వ్యూహాలు
కాపు సామాజిక వ‌ర్గం ఓట్లే అధికం
భీష్మాచార్య ముద్రగడ అస్త్ర‌శస్త్రాలు
వంగా గీత కాపు గానం
పిఠాపురంలో వైసీపీ, టీడీపీ అతిరథుల మ‌కాం
పసుపు సేనాని వర్మ.. రథ సారథ్యం
ప‌వ‌న్ గెలుపు బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు
నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ ఫోక‌స్‌
వైపీసీని ఎండ‌గ‌ట్టేందుకు ప‌క్కా ప్లాన్‌
ప్రచారంలో పవర్ స్టార్ లోకల్ సాంగ్స్

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:
ఏపీలో పిఠాపురం అసెంబ్లీ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల ముఖ్య‌నేత‌లు ఇక్క‌డే మ‌కాం వేశారు. దీంతో పిఠాపురం కోట‌లో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. జనసైనాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమే వైసీపీ ప్రధాన ధ్యేయంగా పెట్టుకోగా.. పవర్ స్టార్ గెలుపే జనసేనకే కాదు, టీడీపీకి అంత్యంత కీలకంగా మారింది. వంగా గీత కాపు గానం పాడుతుండ‌గా.. పవన్ సామాజిక వర్గం దూరం కాకుండా జ‌న‌సేన‌, టీడీపీకి జ‌గ్ర‌త్త ప‌డుతుంది. ఇందుకోసం కాపు నేత ముద్ర‌గ‌డ‌ను వైసీపీ రంగంలోకి దింప‌గా.. వ‌ప‌న్ క‌ళ్యాణ్‌ గెలుపు బాధ్య‌త‌ను వ‌ర్మ‌, చంద్ర‌బాబు తీసుకున్నారు. వ‌ప‌న్ క‌ళ్యాణ్ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే అక్క‌డి స‌మ‌స్య‌లు తెలుసుకుని వైసీపీని ఎండ‌గ‌ట్టేందుకు వ‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారు. మొత్తం మీద పిఠాపురం అసెంబ్లీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి.

వ‌ప‌న్ ఓట‌మే ల‌క్ష్యంగా వైసీపీ వ్యూహాలు..

తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేయగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. పవన్ ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కాపు వర్గాల్లో భీష్ముడిగా పేరొందిన ముద్రగడ పద్మనాభాన్ని మహారథిగా రంగంలోకి దించింది. పవన్ కళ్యాణ్ ఓటమే తన ధ్యేయంగా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇక ఆర్థిక, అంగబలాలను సమకూర్చటానికి ఓ వైపు ఎంపీ మిథున్ రెడ్డి, మరో వైపు మంత్రి రంగనాథ రాజును అతిరథులుగా వైసీపీ బాధ్యతలు అప్పగించింది.

కాపు వ‌ర్గాల ఓట్లు చీల్చ‌డ‌మే ల‌క్ష్యంగా..

- Advertisement -

2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన బలాలను వైసీపీ నేత‌లు లెక్క కడుతున్నారు. ముఖ్యంగా కాపు వర్గాల ఓట్లను చీల్చటమే ప్రధాన ధ్యేయంగా వైసీపీ పావులు కదుపుతున్నారు. మత్స్యకారులు, దళితుల ఓటు బ్యాంకుల్లో వైసీపీ ఓటు బ్యాంకుపై దృష్టి సారించారు. బడుగు, బలహీన వర్గాలన్నీ సీఎం జగన్ హయాంలోని నవరత్నాలు మళ్లీ చేజారిపోరాదంటే వైసీపీకే ఓటు వేయాలనే భావనను చెక్కు చెదరనీయ కూడదని అతిరథులు, మహారథుల వ్యూహం.

పిఠాపురం స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ ఫోక‌స్‌..
నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల‌పై పిఠాపురం జ‌న‌సేన అభ్య‌ర్థి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్ పెట్టారు. సంక్షేమం మాట ఎలా ఉన్నా ఈ నియోజకవర్గంలో ప్రధానంగా అరవిందో కంపెనీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఉప్పాడ బీచ్.. త‌ర్వాత‌ ఈ కంపెనీ వ్యర్థాలను సముద్రంలో కలపటం, అన్నిటికంటే కాకినాడ రేవు నుంచి బియ్యం అక్రమ రవాణ ఆరోపణలు వైసీపీ ఇబ్బందికరంగా మారాయి. ఇవే సమస్యలను పవన్ కళ్యాణ్ ప్రధానంగా తీసుకున్నారు. కాకినాడ మాఫియా సంగతి తేల్చుతానని, తోలు తీస్తానని, తాను ఇక్కడే ఇల్లు తీసుకుని ఉంటానని చెప్పటంతో వైసీపీ వర్గాల్లో అలజడి తప్పలేదు. ఇక ఎట్టి పరిస్థితిలోనూ పవన్ కళ్యాణ్ కు కొమ్ముకాసే వర్మ వర్గాన్ని చీల్చటమే ప్రధాన ధ్యేయంగా పావులు కదుపుతోంది.

పిఠాపురం మహారథి చంద్రబాబే

పవన్ కల్యాణ్ ను గెలిపించే బాధ్యతను చంద్రబాబు స్వీకరించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ నేతగా కొనసాగుతున్న వర్మకు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ప్ప‌టికీ పైనుంచి మొత్తం చంద్ర‌బాబు చూసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. మొదట్లో వ‌ర్మ కొంత అలిగినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని, ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వ‌ర్మ రంగంలోకి దిగారు. దీనికి అనుగుణంగా తన అనుచరులతో మంతనాలు సాగిస్తూ మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు.

సుజయ్ కృష్ణకూ బాధ్యతలు..

2014 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రస్తుతం టీడీపీ తరఫున బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. సుజయ్ కృష్ణకు కూడా పవన్ గెలుపు బాధ్యతను చంద్రబాబు అప్పజెప్పారు. వీరేకాకుండా జిల్లాస్థాయిలో పదవుల్లో రాణించిన నాయకులకు కూడా వార్డుల వారీగా బాధ్యతలు అప్పజెప్పారు. తాజాగా పిఠాపురం వచ్చిన పవన్ కల్యాణ్ శక్తిపీఠాలను సందర్శించడమే కాకుండా శ్రీపాద శ్రీవల్ల క్షేత్రాన్ని కూడా సందర్శించారు.

వ‌ర్మ‌త‌ల్లి నుంచి ఆశీర్వాదం..

పిఠాపురం వ‌చ్చిన ప‌వ‌న్ ముందుగా వర్మ తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. వర్మ పనిచేస్తే పవన్ కల్యాణ్ కు ఊహించనిరీతిలో మెజారిటీ వస్తుందని కూటమి నాయకులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఇండిపెండెంట్ గా పోటీచేసి విజయం సాధించిన వర్మ ఆ సమయంలో ఎటువంటి వ్యూహాలను అమలు చేశారో తెలుసుకొని వాటిని తిరిగి పవన్ కల్యాణ్ గెలుపు కోసం అమలు చేయబోతున్నారు. కాకపోతే అప్పటికీ, ఇప్పటికీ మారిన పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement